ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో దృఢంగా.. వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అక్కడ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీ నిధులు వచ్చిపడుతున్నాయి..అదేవిధంగా కంపెనీలు పెట్టుబడులు పెడితే ఆటోమేటిక్గా పనులు తేలిపోతాయని భావించి, ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన అనేక సంస్కరణలను చేపట్టింది.
ఇందులో ఒక కీలక ఘట్టం ఇప్పుడు రాబోతోంది. రాజధానిలో 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన జరగబోతుందనే సమాచారం వచ్చింది. ఈ కార్యక్రమం ఈ నెల 28వ తేదీన నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరగబోతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం కొన్నివిషయాలపై ఇంకా స్పష్టత లేదు . ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రత్యక్షంగా హాజరవుతారా లేక వర్చువల్గా నిర్వహిస్తారా ? అనేది ఇంకా తేలలేదు.
ఈ ప్రాజెక్ట్ తో అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన ఊతం ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు . ఇక్కడ State Bank of India 14 అంతస్తుల కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా చాలా బ్యాంకులు తమ ముఖ్యమైన కార్యాలయాల్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చాయి. నిర్మలా సీతారామన్ ఈ అన్నిటికి ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం ద్వారా అమరావతి పునర్నిర్మాణ పనుల్లో కేంద్రం ఎంతగా శ్రద్ధ పెడుతోంది అనేది అర్ధం అవుతుంది.