అమరావతి: సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాను మొక్కుకున్న మొక్కును ఇటీవల తిరుమలకు పాదయాత్రగా వెళ్లి చెల్లించుకున్న నేపథ్యంలో, ఈ భేటీ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్, ఆయనకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు బండ్ల గణేశ్ ఒక సంకల్పం తీసుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై, తిరిగి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి, చంద్రబాబు నాలుగోసారి సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 'సంకల్ప యాత్ర' పేరుతో జనవరి 19న షాద్‌నగర్‌లోని తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 23 రోజుల పాటు 535 కిలోమీటర్లు నడిచి, ఫిబ్రవరి 10న తిరుమల చేరుకున్నారు. రెండు రోజుల క్రితం శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నేడు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ను ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. పాదయాత్ర సాగిన తీరును, దారిపొడవునా పార్టీ కార్యకర్తలు తనకు అండగా నిలిచి ప్రోత్సహించారని బండ్ల గణేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురువారం రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా, ఇటీవల తాను పూర్తి చేసిన 'సంకల్ప పాదయాత్ర' గురించి మంత్రికి బండ్ల గణేశ్ వివరంగా తెలిపారు. షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు 535 కిలోమీటర్ల పాటు 23 రోజుల పాటు సాగిన తన పాదయాత్ర అనుభవాలను, దాని వెనుక ఉన్న ఉ ద్దేశాన్ని లోకేశ్‌తో పంచుకున్నారు. అనంతరం, శ్రీవారి దర్శనం తర్వాత స్వీకరించిన తీర్థ ప్రసాదాన్ని లోకేశ్‌కు అందజేశారు. ఇరువురు నేతలు పలు అంశాల పై హృద్యంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. అంతకుముందు బండ్ల గణేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికే ఈ పాదయాత్ర చేపట్టానని బండ్ల గణేశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను ఆత్మీయంగా పలకరించి, పాదయాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. బండ్ల గణేశ్ అందించిన తిరుమల ప్రసాదాన్ని స్వీకరించారు.