అరటిపండు కిలో అర్ధరూపాయి.. ఈ ఒక్క మాట ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. అరటి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో తన సొంత జిల్లాలో పర్యటించారు . ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గం పులివెందులలో అరటి పంటలను సందర్సించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ఆ తరువాత సోషల్ మీడియా X లో ఒక పోస్ట్ చేశారు .
"భారతదేశ ప్రజలరా.. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.. ఇక్కడ ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. అగ్గిపెట్టెకన్నా, బిస్కెట్ కన్నా చవకగా ఇక్కడ అరటి పండ్లు దొరుకుతున్నాయి. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటాల వరకూ.. ఇలా ఏ పంటకూ ఏపీలో గిట్టుబాటు ధర లేదు " అంటూ వైఎస్ జగన్..ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇంకేముంది దుమారం మొదలైంది. ఏపీలో అరటి రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారంటూ రాజకీయ రగడ స్టార్ట్ అయింది. అయితే, ఇప్పుడు ఈ విషయంపై ప్రభుత్వం ధీటుగా స్పందించింది. అరటి రైతులకు ధర లభించడం లేదంటూ వైఎస్ జగన్ చేసిన పోస్ట్ సత్యదూరమని ప్రకటించింది. జగన్ పోస్ట్ పై ఫ్యాక్ట్ చెక్ అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియా X లో ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రకారం.. అక్టోబర్ నెలలో ఈ సీజన్ ప్రారంభం కాగానే అరటి టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడైంది. నవంబరు నెల మొదటి వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు రూ.7 వేలు, బీ గ్రేడ్ రూ.4 వేలు, సీ గ్రేడ్ రూ.3వేల ధర పలికింది. నవంబర్ నెల నాలుగో వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు టన్ను రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెరిగాయి. బీ గ్రేడు రూ.6 వేల నుంచి రూ 8 వేలకు, సీ గ్రేడు రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు ధరల పెరుగుదల కనిపించింది. విషయం ఇలా ఉంటే వైఎస్ జగన్ ఇలా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం దురదృష్టమని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అంతేకాకుండా అరటి సాగవుతున్న జిల్లాల వివరాలు.. భూముల విస్తీర్ణం ప్రకటించింది ప్రభుత్వం.అనంతపురం, సత్యసాయి , కడప, నంద్యాల జిల్లాల్లో 34,000 హెక్టార్లలో అరటి పంట సాగవుతోందని తెలిపింది. కడప, అనంతపురం జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేశామని తెలిపింది. గత వారం రోజులుగా అరటి మెట్రిక్ టన్నుకు రూ 2 వేల నుంచి రూ.4 వేలు పెరిగిందని వెల్లడించింది ప్రభుత్వం . అలాగే, అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాల్సిందిగా భారతీయ రైల్వేను కూడా కోరినట్టు తెలిపింది. డిసెంబర్ రెండో వారం నుంచి అరటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . వాస్తవాలు ఇలా ఉండగా.. రైతులను నిరాశకు గురిచేసేలా ప్రకటనలు చేయడం సరికాదంటూ వైఎస్ జగన్ కు సూచించింది ప్రభుత్వం.
కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అమ్ముడు అవుతున్నాయి అంటూ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో చెప్పడం పూర్తిగా సత్యదూరం. అక్టోబర్ లో ఈ సీజన్ ప్రారంభం కాగానే టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడు పోయింది. నవంబరు మొదటి వారంలో ఏ గ్రేడు అరటి… pic.twitter.com/vWM41RdDYi
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) December 2, 2025