పదేళ్ల క్రితం అప్పటి మార్కెట్ లెక్కలకంటే రెట్టింపు వ్యయంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఆ తర్వాత రెండేళ్లకు దాని కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది.
“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ఒక్క ప్రశ్నతో తొలి భాగం ఉత్కంఠను రేకెత్తిస్తే, ఆ ప్రశ్నకే సమాధానంగా రెండో భాగం రూపుదిద్దుకుంది.
కలలలో కనిపించే మహిష్మతి రాజ్యాన్ని తెరపైకి తెచ్చిన రాజమౌళి
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన విజువల్ మాయతో మహిష్మతి సామ్రాజ్యాన్ని తెరపై సజీవంగా చూపించి, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఇప్పుడు ఆ రెండు భాగాలనూ కలిపి ఒకే సినిమా రూపంలో ‘బాహుబలి: ది ఎపిక్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అంటే ఒకే టికెట్‌తో రెండు సినిమాల అనుభూతి.
కథ తెలిసినా కొత్త అనుభూతి
కథ అందరికీ తెలిసినా, ఈసారి ప్రేక్షకులు కథకంటే ఎక్కువగా ఆ మహిష్మతి లోకాన్ని పెద్ద తెరపై మళ్లీ చూడటానికే థియేటర్లకు వెళ్తున్నారు. రెండు భాగాలను కలిపి చూడటం వల్ల పాత్రలు, భావోద్వేగాలు కలిపి ఇచ్చే అనుభూతి కొత్తగా అనిపిస్తుంది. కథ తెలిసినవారికైనా తెలియనివారికైనా ఇది కొత్త సినిమా అనిపిస్తుంది.
కొన్ని కొత్త డైలాగులు జోడించడమే తప్ప పెద్దగా కొత్త సన్నివేశాలు లేవు. కానీ ఎడిటింగ్, విజువల్ ప్రెజెంటేషన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని విభాగాలూ మరింత చక్కగా రీవర్క్ చేయబడ్డాయి. రాజమౌళి స్వయంగా ఇచ్చిన వాయిస్ ఓవర్ కథనాన్ని మరింత బలపరిచింది. ‘శివుడు–అవంతిక’ లవ్ ట్రాక్‌ను కొంత కుదించి, యుద్ధ సన్నివేశాలను మరింత కాంపాక్ట్‌గా మలిచారు.
భావోద్వేగాల తుఫాన్‌గా ద్వితీయార్థం
‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ భాగం ప్రారంభమైన తర్వాత సినిమా పూర్తిగా భావోద్వేగాల తుఫాన్‌గా మారుతుంది. ప్రతి ఎపిసోడ్ ఒక హైలైట్‌గా నిలుస్తుంది. తొంభై నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించినప్పటికీ సినిమా ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. సంగీతం, విజువల్స్ మధ్య ఎక్కడా విరామం రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
కొత్త సీన్ – థియేటర్లలో విజిల్స్
రాజమౌళి ఈసారి ఒక కొత్త సన్నివేశాన్ని జోడించారు. శివుడు మాహిష్మతి సామాజ్యంలోకి అడుగుపెట్టే సన్నివేశాన్ని మునుపటి కంటే డిఫరెంట్‌గా చూపించారు. ఈ సీన్‌కి థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ కొడుతుండగా, సోషల్ మీడియాలో గూస్బంప్స్ వస్తున్నాయంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
చాలా రోజుల తర్వాత పెద్ద తెరపై ప్రభాస్ రాయల్ లుక్‌లో కనిపించడం అభిమానులకు పండగే. భల్లాలదేవుడిగా రానా దగ్గాబాటి మరోసారి తన ప్రభావాన్ని చూపాడు. కట్టప్పగా సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా.. ప్రతి పాత్ర కూడా మళ్లీ కొత్తగా మెరిసిపోయింది.
కీరవాణి సంగీతం ఈసారి మరింత గ్రాండ్‌గా వినిపించింది. నేపథ్య సంగీతం సినిమాలో కొత్త ఉత్సాహం నింపింది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగ్గా తయారయ్యాయి.
కొత్త ట్రెండ్‌కు శ్రీకారం
భారతదేశంలో పాన్–ఇండియా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ‘బాహుబలి’ ఇప్పుడు మరో కొత్త పంథాను ప్రారంభించింది. రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా చూపించడం. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో మరెన్నో చిత్రాలు ఈ దారిలో సాగవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘బాహుబలి: ది ఎపిక్’ చివర్లో ప్రేక్షకులకు ఒక ప్రత్యేక సర్ప్రైజ్ కూడా ఉంది. త్వరలో రానున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో ఈ కొత్త ప్రయత్నం ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
మహిష్మతి మళ్లీ మోగుతోంది... ‘బాహుబలి: ది ఎపిక్’తో!