భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్‌కు (అక్టోబర్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు) సంబంధించి టీమిండియా సీనియర్ పురుషులు, మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈసారి బోర్డు తన కాంట్రాక్ట్ విధానంలో అనూహ్య మార్పులు చేస్తూ సీనియర్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది బీసీసీఐ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించడం. గత సీజన్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈ టాప్ గ్రేడ్‌లో ఉ ండేవారు. అయితే, తాజా జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను గ్రేడ్-బి కి తగ్గించారు.
కారణం ఇదే: రోహిత్, కోహ్లిలు ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లకు మాత్రమే అత్యున్నత గ్రేడ్ ఇవ్వాలనే నిబంధనతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాంట్రాక్టుల్లో గ్రేడ్-ఏ అత్యున్నత కేటగిరీగా ఉంది. ఇందులో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది. టెస్టులు, వన్డేలకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టిన గిల్, గ్రేడ్-బి నుండి గ్రేడ్-ఏకి ప్రమోషన్ పొందాడు. స్టార్ పేసర్ బుమ్రా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సీనియర్ జడేజా కూడా గ్రేడ్-ఏలోనే కొనసాగుతున్నారు.
గ్రేడ్ల వారీగా ఆటగాళ్ల జాబితా
గ్రేడ్-బి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్.
గ్రేడ్-సి: తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు అక్షర్ పటేల్, సంజు శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ వంటి 16 మందికి చోటు దక్కింది. వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి ఈసారి వార్షిక కాంట్రాక్టులో చోటు దక్కలేదు. మహిళా విభాగంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ గ్రేడ్-ఏలో కొనసాగగా, అద్భుత ప్రదర్శన చేసిన జెమీమా రోడ్రిగ్స్ గ్రేడ్-బి నుండి గ్రేడ్-ఏకి ప్రమోషన్ పొందింది. గతేడాది 34 మందికి కాంట్రాక్టులు ఉ ండగా, ఈసారి ఆ సంఖ్యను 30 మందికి తగ్గించింది.