టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా సన్నాహకాల్లో భాగంగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 2) ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. యువ సంచలనం తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఇవ్వడం, ఐపీఎల్ స్పీడ్ స్టార్ మయూంక్ యాదవ్ జట్టులోకి రావడం ఈ స్క్వాడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా తన సన్నాహకాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అమెరికా, నమీబియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని పరీక్షించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఢిల్లీకి చెందిన యువ బ్యాటర్ ఆయుష్ బదోనికి జట్టు పగ్గాలను అప్పగించింది. దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న ఐదోనికి ఇది ఒక పెద్ద అవకాశం. తెలుగు క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే.. గాయం కారణంగా కొన్నాళ్లు దూరమైన తిలక్ వర్మ జట్టులోకి తిరిగొచ్చాడు. సర్జరీ తర్వాత కోలుకున్న తిలక్, ఫిట్నెస్ టెస్ట్ పాసై జట్టులో చేరాడు. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తిలక్ వర్మ ఇండియా-ఎ తరపున కేవలం ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడతాడు. ఆ మ్యాచ్ లో తన ఫిట్నెస్ను నిరూపించుకున్న తర్వాత నేరుగా టీమిండియా (సీనియర్ జట్టు)లో చేరి వరల్డ్ కప్ ఆడతాడు. ఇది తిలక్ కెరీర్‌కు అత్యంత కీలకమైన సమయం. ఐపీఎల్లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచిన మయూంక్ యాదవ్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో ఆడిన తర్వాత గాయపడిన మయంక్, సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్నాడు. అతని వేగం టీమిండియాకు రాబోయే రోజుల్లో పెద్ద ఆస్తి కానుంది. మయూంక్ తో పాటు ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్ వంటి సీనియర్ బౌలర్లు కూడా ఈ జట్టులో ఉ ండటం విశేషం. ఇక రెండో మ్యాచ్ ఫిబ్రవరి 6 (శుక్రవారం) నమీబియాతో జరుగుతుంది. ఈ మ్యాచుల ద్వారా యువ ఆటగాళ్ల ఫామ్‌ను పరిశీలించి, అవసరమైతే మెయిన్ వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి ఎవరినైనా తీసుకునే అవకాశం ఉంది. రియాన్ పరాగ్, నమన్ ధీర్, ఆశుతోష్ శర్మ వంటి హిట్టర్లు ఈ జట్టులో ఉండటంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఇండియా-ఎ స్క్వాడ్ (వార్మప్ మ్యాచుల కోసం):
ఆయుష్ బదోని (కెప్టెన్), నమన్ ధీర్, ఆశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మానవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), గుర్జాప్నీత్ సింగ్, విప్రజ్ నిగమ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, మయూంక్ యాదవ్.