ప్రజాస్వామ్యాన్ని అణచలేరు శ్రీకాళహస్తిలో
టీడీపీ హింసాత్మక రాజకీయాలు మాజీ ఎమ్మెల్యే
బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం
శ్రీకాళహస్తి, : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి ఆయన టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా శ్రీకాళహస్తిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రజలంతా గమనించారని, ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దౌర్జన్యాలతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అణచలేరని అన్నారు. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, కార్లు, ఆటోలను ధ్వంసం చేయడం, వ్యక్తులపై దాడులకు దిగడం వంటి చర్యలను ఖండించారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గుచేటని ఎంపీ మద్దెల గురుమూర్తి పేర్కొంటూ బాధితులకు, అభ్యర్థులకు న్యాయం జరిగేలా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. దాడులకు భయపడేది లేదని, అన్యాయంపై పోరాటాన్ని ఆపేది లేదని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం స్పష్టం చేశారు. తన అనుచరులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని బియ్యపు మధుసూదన్ రెడ్డి తప్పుబట్టారు. న్యాయం కోసం పోరాడుతున్న తన బిడ్డలపై కేసులు పెట్టడం అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు. భవాని మాల ధరించిన వ్యక్తిపై తప్పుడు అరోపణలు చేశారని పేర్కొంటూ, తనపై చేసిన అరోపణల విషయంలో కాణిపాకంలో ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. దాడులు, దౌర్జన్యాలతో తమ పార్టీ కార్యకర్తలు, వెనుకడుగు అభ్యర్థులు వేయరని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాల్సిన నాయకులు దౌర్జన్యాలకు దిగడం సిగ్గుచేటని, మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచి పోరాటం చేసిన మహిళలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు బియ్యపు మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.