100 పతకాల మార్క్ దాటిన భారత్
ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఏషియన్ పారా గేమ్స్ భారత క్రీడాకారులు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఐదో రోజు మన అథ్లెట్లు ప్రపంచ రికార్డుల మోత మోగించి స్వర్ణాల వర్షం కురిపించారు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల సంఖ్య 100 మైలురాయిని దాటింది. షూటింగ్లో మోనా అగర్వాల్ అద్భుతం చేసింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎహెహెచ్1 విభాగంలో 357.5 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ గేమ్స్ లో ఆమెకు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. చైనా క్రీడాకారిణి కుయిపింగ్ జాంగ్‌పై 3.8 పాయింట్ల భారీ ఆధిక్యంతో మోనా విజయం సాధించింది. అథ్లెటిక్స్‌లోనూ భారత హవా కొనసాగింది. టీ44400 మీటర్ల స్ప్రింట్‌లో సందీప్ కుమార్ కేవలం 52.28 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 100 దాటింది. ఇదే ఈవెంట్లో అజయ్ కుమార్ 53.61 సెకన్లతో కాంస్య పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఎఫ్37 విభాగంలో హనీ తన చివరి ప్రయత్నంలో 60.49 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఇతర క్రీడల్లోనూ భారత్ సత్తా చాటింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 బ్యాడ్మింటన్ ఆల్ ఇండియన్ ఫైనల్లో ప్రమోద్ భగతన్ను ఓడించి నితేష్ కుమార్ స్వర్ణం గెలుచుకోగా, ప్రమోద్ రజతంతో సరిపెట్టుకున్నాడు. పారా ఆర్చరీ పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో హర్విందర్ సింగ్, విజయ్ సుండి ద్వయం 5-1 తేడాతో చైనాపై గెలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.