నందమూరి నటసింహం బాలయ్య బాబు అఖండ తాండవం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాతలకు పాత ఫైనాన్షియల్ ఇబ్బందులు తలెత్తడం.. మద్రాస్ హై కోర్ట్ స్టే ఇవ్వడంతో డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఇదే రూటులో మరో సినిమా ప్రయాణం సాగుతోంది, అది తమిళ సినిమా కానీ , తెలుగులోనూ వస్తోంది. తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తీ హీరోగా నటించిన మూవీకి ఇప్పుడు సేమ్ అఖండ తాండవం నిర్మాతలకు వచ్చిన తలనొప్పులు వచ్చాయి . వివరాలు ఇవే..
కార్తి హీరోగా, నలన్ కుమార్‌స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలింది. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆర్థిక వివాదంలో చిక్కుకోవడంతో దాని విడుదల తేదీపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.
పాత ఆర్థిక లావాదేవీల వివాదం:
ఈ స్టేకు ప్రధాన కారణం.. చిత్ర నిర్మాత కె.ఈ. జ్ఞానవేల్ రాజా (స్టూడియో గ్రీన్ అధినేత), ఫైనాన్షియర్ అర్జున్‌లాల్ సుందర్‌దాస్ మధ్య ఉన్న పాత ఆర్థిక లావాదేవీల వివాదమే.
-
ఫైనాన్షియర్ ఆరోపణ: 2014లో జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై అర్జున్‌లాల్ సుందర్‌దాస్ వద్ద రూ.10.35 కోట్ల రుణం తీసుకున్నారు.
-
బకాయిలు: వడ్డీలతో కలిపి ప్రస్తుతం ఆ మొత్తం రూ.21.78 కోట్లకు చేరింది.
-
కోర్టులో పిటిషన్: తనకు ఆ మొత్తం చెల్లించకుండా జ్ఞానవేల్ రాజా కొత్త సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ అర్జున్‌లాల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బకాయిలు పూర్తిగా క్లియర్ చేసే వరకు ‘వా వాతియార్’ విడుదలను ఆపాలని ఆయన కోరారు.
మద్రాస్ హైకోర్టు నిర్ణయం:
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం మరియు జస్టిస్ కుమరప్ప ధర్మాసనం.. అర్జున్‌లాల్ వాదనలను పరిశీలించి, ‘వా వాతియార్’ (అన్నగారు వస్తారు) విడుదలపై మధ్యంతర స్టే విధించింది.
చిత్ర యూనిట్‌కు, అభిమానులకు షాక్:
కార్తికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ‘అన్నగారు వస్తారు’ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా సాగుతుండగా, విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా కోర్టు నుండి స్టే ఆర్డర్ రావడంతో చిత్ర యూనిట్‌కి ఇది ఊహించని షాక్ అయింది. ఈ లీగల్ ఇష్యూతో కార్తి అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు.
పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, 8వ తేదీన జరిగే విచారణలోపు బకాయిల చెల్లింపు లేదా లావాదేవీల నిజానిజాలపై స్పష్టత రాకపోతే సినిమా విడుదల మరింత ఆలస్యం కావొచ్చు. ప్రస్తుతం అందరి దృష్టి ఈ నెల 8వ తేదీన జరగబోయే కోర్టు విచారణపైనే ఉంది, అదే ఈ సినిమా భవిష్యత్తును నిర్ణయించనుంది.