ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేడ్కర్ కళా వేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వంశపారం పర్యంగా వచ్చిన కళను ముందుకు తీసుకెళ్లడం కూడా ముఖ్యమే. హస్తకళా రంగాలు భారతదేశ మూలాలు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగాలంటే హస్తకళను, చేనేతను చేనేతను కాపాడుకోవాల్సి ఉ ందన్నారు. ఒక జాతి గొప్పతనం.. నిర్మించిన భవనాల్లో కాదు.. కళాకారుల్లో కనిపిస్తుంది. కళాకారుల ప్రతిభ.. వారి కష్టాన్ని గుర్తించడానికే ఇక్కడికి వచ్చాను. సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉంది. వస్తువుల తయారీ మాత్రమే కాదు.. వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. తరతరాల సంప్రదాయాన్ని కళాకారులు కాపాడుతున్నారని అభినందించారు. రాష్ట్రంలో 2 లక్షల మందికిపైగా కళాకారులున్నారు. గ్లోబల్ మార్కెట్కు అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి కొత్త దశను తీసుకొస్తాం. వదిలేసిన వస్త్రాలు కూడా వ్యర్థం కాకుండా వస్తువుల తయారీ చూస్తున్నాం. డబ్బు సంపాదనే కాదు.. పర్యావరణ పరిరక్షణ కూడా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం కూడా అభివృద్ధి చెందాలి. మారుమూల గ్రామంలోని కళాకారుడి కృషి.. ప్రపంచానికి చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు.. లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా పని చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక జాతి గొప్పతనం నిర్మించిన భవనాల్లో కాదని, కళాకారుల్లో కనిపిస్తుందని అభివర్ణించారు. కళాకారుల అద్భుత ప్రతిభను, వారి కష్టాన్ని గుర్తించడానికి తాను ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. హస్తకళాకారుల వస్తువుల తయారీ మాత్రమే కాకుండా, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా, రామాయణంలోని రావణ సంహార ఘట్టాన్ని తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన తీరును పవన్ కల్యాణ్ అభినందించారు. ప్రతి స్టాల్ను సందర్శించి, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ ప్రోత్సహించారు. కళాకారులతో కలిసిపోయి, వారి నైపుణ్యాలను ప్రశంసించారు. వారి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కళాకారుల కోరిక మేరకు, క్లస్టర్ల వారీగా గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీ హస్తకళల అభివృద్ధికి తమ ప్రభుత్వం అవసరమైన మద్దతును అందిస్తోందని స్పష్టం చేశారు. పర్యావరణ పర్యాటకం, ఆలయ పర్యాటకం తరహాలో హస్తకళల పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. కళాఖండాలను సృష్టించే కళాకారులకు తగిన గుర్తింపు లభించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కళాకారుల పోరాటాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక డాక్యుమెంటరీలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీబీజీ రామ్ జీ పథకం కింద క్లస్టర్ల వారీగా ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హస్తకళల పరిరక్షణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం క్లస్టర్ల వారీగా నిరంతర వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. ఆంధప్రదేశ్ హస్తకళల ఉత్సవంలో మొదటి అడుగుగా కాకినాడకు చెందిన తోలుబొమ్మలాట కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్ను పవన్ కల్యాణ్ సందర్శించారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా రూపొందించిన రామాయణ, మహాభారత, భాగవత కళారూపాలను పరిశీలించారు. తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన రావణ వధ ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయంగా తోలుబొమ్మలాటను జీవనోపాధిగా చేసుకున్న తమ కుటుంబాలు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నాయని కళాకారులు వివరించారు. ఈ కళారూపాల గొప్పతనాన్ని ప్రదర్శించడానికి, రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఉప్పాడ చీరల స్టాల్ను పవన్ కల్యాణ్ సందర్శించారు. తన సతీమణి అన్నా కొణిదెల కోసం మూడు ఉప్పాడ జామ్లానీ పట్టు చీరలను కొనుగోలు చేశారు. అరటి పీచుతో చేసిన హ్యాండ్బ్యాగులు, ఇతర పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై ప్రత్యేక ఆసక్తి కనపరిచారు. కళాకారుల నుంచి ఉత్పత్తి వద్ధతుల గురించి ఆరా తీసి, వారి నుంచి ఒక హ్యాండ్బ్యాగ్ను కొనుగోలు చేశారు. తిరుపతి చెక్క శిల్పకారులు రూపొందించిన చెక్క బొమ్మల స్టాల్ను సందర్శించారు. కళాకారుల అద్భుతమైన కళాఖండాలను ప్రశంసించి, వారి నుంచి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కొనుగోలు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన కలంకారి వస్త్రాల స్టాల్ పరుపుల షీట్లు పవన్ దృష్టిని ఆకర్షించాయి. కలంకారి నేత కళాకారుల కఠోర శ్రమ గురించి ప్రతిఒక్కరూ తెలుసుకునేలా వీడియో డాక్యుమెంటరీలను రూపొందించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.