ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని రాజధానిగా చూపిస్తూ 28 జిల్లాలతో కూడిన తాజా రాష్ట్ర మ్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పరిపాలనా మార్పులకు అనుగుణంగా ఈ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త మ్యాప్‌లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని 28 జిల్లాలను స్పష్టంగా చూపించారు. ఇందులో ఇటీవల ఏర్పాటైన మార్కాపురం, పల్నాడు, పోలవరం, అల్లూరి సీతారామరాజు, పి. మన్యం వంటి జిల్లాలు కూడా చోటు దక్కించుకున్నాయి. అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి-కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలను మ్యాప్‌లో పొందుపరిచారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో చోటుచేసుకున్న తాజా మార్పులను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ మ్యాప్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ప్రణాళికా విభాగాలు, అత్యవసర సేవల సంస్థలు అధికారిక అవసరాల కోసం ఈ మ్యాప్‌ను వినియోగించే అవకాశం ఉంది. అమరావతిని రాజధానిగా చూపిస్తూ విడుదలైన ఈ తాజా మ్యాప్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.