శివ భక్తులు జీవితంలో ఒకసారైనా దర్శనం చేసుకోవాలని పరితపించే అమర్నాథ్ యాత్ర మొదలైంది. మంచు లింగంగా సాక్షాత్కరించే శివయ్య దర్శనం కోసం వేలాదిగా భక్తులు అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర చేస్తారు. ఏడాదిలో కొన్నిరోజులు మాత్రమే ఉండే ఈ యాత్ర కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది ఇప్పుడు మొదలైన ఈ అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9 రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. అంటే సుమారు నలభై రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. గతంలో ఇంకా ఎక్కువ రోజులు యాత్ర కొనసాగేది.
పహల్గామ్ దాడి తర్వాత అమర్ నాథ్ యాత్ర జరుగుతుండటంతో అడుగడుగునా నిఘా పెంచారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే పలుసార్లు సెక్యూరిటీపై సమీక్షలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పహల్గామ్, బాల్తాల్‌లోనైతే చీమ చిటుక్కుమన్నా తెలిసేలా సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు.
ఈసారి అమర్నాథ్ యాత్రికులకు RFID ట్యాగ్లు ఇచ్చారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇటు ఆర్మీతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీని పటిష్టం చేశారు. అలాగే యాత్ర మార్గాన్ని నో ఫ్లైజోన్‌గా ఇప్పటికే ప్రకటించారు. అమర్నాథ్ యాత్రకు ఈసారి హెలికాప్టర్ సర్వీసులను నిలిపివేశారు.
అమర్నాథ్ యాత్ర సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు నెలరోజులపాటు మాక్ డ్రిల్ నిర్వహించాయి. యాత్ర మార్గంలోనూ మాక్‌డ్రిల్ చేపట్టారు. ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపైనా మాక్‌డ్రిల్ నిర్వహించారు. పహల్గామ్ దాడి జరిగి రెండునెలలు దాటినప్పటికీ కశ్మీర్లో హైఅలర్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది.
మొత్తంగా.. ఈసారి అత్యంత పకడ్భందీగా అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు చేశారు. చీమచిటుక్కమన్నా క్షణాల్లో తెలిసిపోయేలా… ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించాయి. భక్తులకు కొండంత భరోసానిస్తున్నాయి.