రాష్ట్రాభివృద్ధితో పాటు కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకే సుపరిపా లన అందిస్తున్నామని వివరించారు. ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు నింపే ప్రయ త్నం చేస్తున్నామని వివరించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారి పాలెంలో బుధవారం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజా వేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... ప్రజలు చూపిస్తున్న అభిమానంతో పడుతున్న కష్టాన్ని మర్చిపోతున్నాం. గత పాలకులు నెల్లూరు జిల్లాను అశాస్త్రీయంగా విభజించారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి నెరవేర్చాం. సైదాపురం, కలవాయి మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపాం. ప్రజల అభీష్టం ప్రకారమే పరిపాలన జరగాలి. పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఆశాస్త్రీయంగా జరిగినల్లాల విభజనను నవరించాం. ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. సామాజిక బాధ్యతగానే ప్రతీ నెలా 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నాం. వృద్దాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నాం. పేదల జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో పీ4 కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకూ రూ.68,598 కోట్ల మేర పెన్షన్ల కింద కూటమి ప్రభుత్వం వంపిణీ చేసింది. ప్రతీ నెలా 62.20 లక్షల మందికి రూ.2,712 కోట్లు పెన్షన్లకు చెల్లిస్తున్నాం.' అని సీఎం అన్నారు. గడిచిన రెండేళ్ల ప్రయాణంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటంతో పాటు వ్యవస్థలను గాడిలో పెట్టామని, సంక్షోభాలు, సమస్యలను దాటుకుని ప్రజలకు మేలు చేసేలా అనునిత్యం పనిచేస్తున్నామని అన్నారు. 'గత పాలకులు ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారు... రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రెండేళ్ల లోనే అన్ని పనులూ చేసేశామని మేం చెప్పటం లేదు. కానీ శుభారంభం చేశాం. గత అవినీతి పాలనను మార్చి రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన తీసుకువచ్చాం. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఆన్లైన్లో సేవలను అందిస్తూ ప్రజల చేతిలోకి పౌర సేవలను తీసుకువచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించగలుగుతున్నాం. తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేశాం. పేదల జీవన ప్రమాణాలు పెంచి వారికి అండగా నిలవాలనేది కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యం. సంపన్నులైన 10 శాతం మంది అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదలను ఆదుకునేలా పీ4 కార్యక్రమం చేపట్టాం. ఆర్ధిక అసమానతలు తొలగించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు నా జీవితాన్ని అంకితం చేశాను. లక్ష మందికి పైగా మార్గదర్శులు, 10 లక్షలకు మందికి పైగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. మహిళలను పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా తయారు చేసేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం. పొదుపు ఉ ద్యమంలో మన డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే బ్యాంకులు కూడా డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. 'రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్లుగా చేసి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నాం. అభివృద్ధిలో సంపద సృష్టిలో నెల్లూరు జిల్లా దేశంలోనే అగ్రగామి జిల్లాగా మారుతుంది. రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ వస్తున్నాయి. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ లక్ష కోట్లతో రిఫైనరీ పెడుతోంది. ఇఫ్కో కిసాన్ సెజ్ లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటికే గూడూరు ప్రాంతంలో 27 మెగా పరిశ్రమలు వచ్చాయి. మెగా ఫర్నిచర్ పార్కు కూడా ఏర్పాటు కాబోతోంది. మన రాష్ట్రంలోనే ఉన్న శ్రీసిటీ దేశ పారిశ్రామిక ప్రాంతాలకు ఆదర్శం. గత పాలకుల వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు పారిపోయాయి. ఇప్పుడు కూటమిపై నమ్మకంతో పెట్టుబడి దారులు తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారి కారిడార్లు, 4 లేన్ రైల్వే ట్రాక్ కూడా మన ప్రాంతం నుంచి వెళ్లేలా ప్రాజెక్టులు వస్తున్నాయి. అన్ని పోర్టులకూ రైల్వే లైన్లను అనుసంధానించి ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేస్తాం' అని సీఎం చంద్రబాబు అన్నారు. 'సాగునీటికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 36 ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా కేలండర్ విడుదల చేశాం. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాంతానికి అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. ఇంకా రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్ ఉండగానే గత పాలకుడు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. డ్రామాల రాయుడికి నాటకాలు అడటమే పని. రూ.900 కోట్లు పునరావాసానికి నిధులు విడుదల చేస్తున్నాం. ఇప్పటికే నిర్వాసితులకు రూ.300 కోట్లు చెల్లింపులు చేశాం. త్వరలోనే మిగతా మొత్తాన్ని కూడా చెల్లిస్తాం. రూ.2,500 కోట్లతో వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప తదితర జిల్లాలకు నీళ్లిస్తాం. ఎల్ నినో ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా ఉంది. వర్షాలు బాగా తగ్గాయి. గత ఏడాది పడిన వర్షాలకు గోదావరి, కృష్ణానదులు పొంగి పొర్లాయి. ఆ సమయంలోనే రిజర్వాయర్లను నింపాం. ఈ ఏడాది ఇప్పటికీ నదుల్లో ప్రవాహాలు రాలేదు. అయినా ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నిల్వలు ఉన్నాయి. అందుకే భూమినే జలాశయంగా మార్చుకునేలా జల ధార లాంటి కార్యక్రమాలు చేపట్టాం. నదుల అనుసంధానం చేసేలా ప్రణాళికలు కూడా చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేస్తే దిగువ రాష్ట్రాలకూ నీరు ఇచ్చే పరిస్థితి ఉంటుంది' అని సీఎం అన్నారు. 'పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఈ సమయంలోనే ఇథనాల్ వినియోగించుకుని ఇంధన పొదుపు చేయాల్సి ఉంది. ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్న లాంటి వంటలు అవసరం అవుతాయి. రైతులు ప్రత్యామ్నాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిశ్రమల్ని ఆహ్వానించడానికి సమయం వడుతుంది. కానీ తరిమి కొట్టడానికి ఒక్క క్షణం చాలు. గత పాలకులు పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. కర్ణాటకకు వెళ్లిపోవాల్సిన హీరో మోటార్స్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేసేలా కృషి చేశాం. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు కూడా 3వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నాం. 2028 నాటికి ఆ రాయలసీమలో స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కూడా ప్రారంభిస్తుంది. నా ప్రయత్నం అభివృద్ధి, సంక్షేమం, సువరిపాలన అందించటమేనని అన్నారు. అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల మహిళలు ప్రదర్శించిన అధునాతన కుట్టు మిషన్లను సీఎం తిలకించారు. ఆధునిక కుట్టు మిషన్ తో సీఎం చంద్రబాబు చిత్ర పటాన్ని అప్పటికప్పుడే తయారు చేసిన మహిళలు దానిని ముఖ్యమంత్రికి అందించారు. అరటి నారతో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను చూసిన సీఎం డ్వాక్రా సంఘాల మహిళలను అభినందించారు. ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న ఉద్యాన పంటల ఉత్పత్తులు, మత్స్యకార బోట్లకు బిగించే ట్రాన్స్ పాండర్లను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, ఎన్ఎండీ ఫరూఖ్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ హిమాన్లూ శుక్లా తదితరులు హాజరయ్యారు.