కొన్ని విషయాలకు లాజిక్ లు పనిచేయవు. ముఖ్యంగా బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు. అవును.. టాలీవుడ్ లో బాలయ్య రేంజ్ వేరు. బాలయ్య బాబు సినిమాని అభిమానులు లాజిక్ పక్కన పెట్టి చూస్తారు. బాలకృష్ణ చేసే మేజిక్కే వాళ్లకు కావలసింది. ప్రేక్షకులు కూడా అంతే. బాలయ్య బాబు సినిమా అంటే లాజిక్స్ కంటే మేజిక్స్ కోసమే థియేటర్లకు వెళతారు. అయితే , బాలకృష్ణతో ఎలాంటి మేజిక్ లు చేయించాలో తెలిసిన ఏకైక డైరెక్టర్ మాత్రం బోయపాటి ఒక్కరే. అది మరోసారి అఖండ తాండవం రుజువు చేసింది.
కథ ఎలా ఉంది అనేది బాలకృష్ణ - బోయపాటి సినిమాకి అవసరం లేదు. ఓపెన్ అయిన దగ్గర నుంచి శుభం కార్డు వరకూ బాలయ్యను ఎంత పవర్ ఫుల్ గా చూపించారనేదే ప్రధానం. బాలకృష్ణను ఎలా చూపించాలో . . ఎలా చూపిస్తే ఫ్యాన్స్ తో పటు ప్రేక్షకులు ఖుష్ అవుతారో బోయపాటికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అదే అఖండ2 లో కనిపిస్తుంది. సీను సీనుకి సిటీలు మోగడం అంటే ఏమిటో అఖండ2 థియేటర్లలో చూడాలి.
అఖండ ఎక్కడ ఆగిందో దానికి పదిహేనేళ్ల తరువాత అఖండ తాండవం మొదలవుతుంది. రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్న బాల మురళీ కృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీఓలో ట్రైనీగా ఉంటుంది. చిన్న వయసులోనే అద్భుత ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. మరోవైపు మహాకుంభమేళాపై దుష్టులు విరుచుకుపడతారు. అక్కడ సంగమంలో వైరస్ కలుపుతారు. ఆ వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ జనని కనిపెడుతుంది. డీఆర్డీవో నుంచి ఆ వ్యాక్సిన్ ప్రజలకు చేరకూడదని విలన్లు దాడి చేస్తారు. సరిగ్గా ఈ విషయం అఖండకు తెలుస్తుంది. ఎప్పుడు ఆపదలో ఉన్నా వస్తానని ఇచ్చిన మాట ప్రకారం జనని రక్షించడానికి అఖండ బయలుదేరుతాడు . ఇక తాండవం మొదలవుతుంది. చివరకు ఏ విధంగా సమస్యను ముగించారనేదే సినిమా.
ముందే చెప్పినట్టు . . కథలు . . లాజిక్ లు వదిలేసే బాలయ్య సినిమా చూడాలి. మూవీలో చెప్పుకోవాల్సిందే బాలకృష్ణ గురించి. అఖండ పాత్రకి ఆయన తప్ప ఎవరూ సూట్ కారు. ప్రతి యాక్షన్ సీన్ లోనూ బాలకృష్ణ తాండవం కనిపించింది. ప్రతి డైలాగ్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా త్రిశూలం ఫైట్ మామూలుగా లేదు.
మాస్ మూవీ ఎలా ఉండాలో అలా ఉంటుంది అఖండ తాండవం. ఇక బాలకృష్ణను ఎలా చూపించాలో బోయపాటికి తెలిస్తే . . బాలకృష్ణ యాక్షన్ సీన్స్ ఎలా ఎలివేట్ చేయాలో తమన్ కు తెలుసు. అసలు బాలయ్య బాబు మూవీ అంటేనే తమన్ లో తాండవం మొదలైపోతుంది. ఈ అఖండ తాండవంలో తమన్ బీజీఎమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య బాబు శూలం తిప్పుతూ వస్తుంటే తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్లలో స్పీకర్లు అదిరిపోయాయి.
మూవీలో అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికం . . హైందవం . . సనాతన ధర్మం వీటిపై బాలకృష్ణతో చెప్పించిన డైలాగులు అదిరిపోయాయి. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. లాజిక్ లు వెతికే వారిని పక్కన పెడితే.. ప్రతి సీన్ సూపర్ గా ఉంటుంది. అలాగే, అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. పాటలు బాగావున్నాయి . బాలకృష్ణ హుషారుగా స్టెప్స్ వేస్తె ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఆ రేంజిలో నే సాంగ్స్ ఉన్నాయి.
మొత్తంగా చూసుకుంటే అఖండ తాండవం ముగ్గురి వెండితెర తాండవం అని చెప్పొచ్చు . బాలకృష్ణ + బోయపాటి + తమన్ = థియేటర్లు దద్దరిల్లిపోవాలి అంతే!