తదుపరి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతారా? అనే ప్రశ్నకు దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఫిట్నెస్, ఫామ్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగవచ్చని అభిప్రాయపడ్డాడు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, 35 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల కుర్రాడి కంటే ఫిట్‌గా ఉంటే అతనే జట్టుకు అర్హుడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కూడా ఫిట్‌గా ఉండి, ఫామ్‌లో ఉంటే వన్డే ప్రపంచకప్ 2027 ఆడుతారని బదులిచ్చాడు. వయసును కాకుండా ఫామ్, ఫిట్నెస్ను పరిగణలోకి తీసుకోవాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పరోక్షంగా చురకలంటించాడు. 'రోహిత్, కోహ్లి వన్డే ప్రపంచకప్ 2027లో ఎందుకు ఆడకూడదు? నా దృష్టిలో వయసు కొలమానం కాదు. ప్రదర్శన, ఫిట్నెస్ మాత్రమే జట్టులో కొనసాగాలా? వద్దా? అనేదానికి ప్రమాణాలు. అందుకే ఎవరికీ ఎమి చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉ ండాలి. జట్టులో అందరినీ ఒకేలా చూడాలి. నేను అరంగేట్రం చేసినప్పుడు నాకు 24 ఏళ్లు. ఆ సమయంలో ఎవరూ వచ్చి నాకు ఏం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు నేను భారత్ తరఫున ఏడాది ఆడినా... మరో పదేళ్లు, 20 ఏళ్లు ఆడినా.. నా వయసు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వయసు ఏమాత్రం కొలమానం కాదు. ఫిట్నెస్ అత్యంత ముఖ్యం. 22 ఏళ్ల కుర్రాడు కూడా ఫిట్‌గా లేకపోతే జట్టుకు అనవనరం. విరాట్ కోహ్లి లేదా భవిష్యత్తులో వచ్చే ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడితే.. ఒకరికి 30 ఏళ్లు దాటాయి కాబట్టి వారు తదుపరి ప్రపంచకప్ ఆడగలరా? లేదా? అనే నిర్ణయించాల్సింది మనం కాదు. అది వారి వ్యక్తిగత నిర్ణయం. వారు ఫిట్‌గా ఉండి నిలకడగా రాణిస్తూ.. దేశంలో కోసం ఆడాలనే పట్టుదలతో ఉంటే.. వారిని ఎందుకు పక్కనపెట్టాలి. అనుభవం కలిగిన ఆటగాళ్లు ఎలా వస్తారు? సచిన్ టెండూల్కర్ మినహా ఎవరూ 20 ఏళ్ల వయసులోనే అనుభవం సంపాదించలేదు. సచిన్ 16-17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారు చాలా తక్కువ. అంతర్జాతీయ క్రికెట్ చాలా భిన్నమైనది. ప్రస్తుతం అనుభవం కలిగిన ఆటగాళ్లు కావాలంటే 30-33 ఏళ్ల వయసున్న వారు కావాలి. కానీ మనం 20, 25 మ్యాచ్‌లు ఆడిన వారిని అనుభవం కలిగిన ఆటగాళు గా చూస్తున్నాం. ఒత్తిడిలో ఆడితేనే నిజమైన అనుభవం వస్తుంది. కేవలం మ్యాచ్‌ల సంఖ్యతో కాదు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చేసేవారు, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేవారికి అనుభవం చాలా ముఖ్యం. ఉ త్కంఠగా సాగే మ్యాచ్‌లు ముగింపుకు వచ్చినప్పుడు వారి అనుభవం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక బౌలర్ నేను 10-20 సార్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాలంటే, కనీసం నేను 80-85 మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే నా భావోద్వేగాలను ఎలా నియంత్రించచుకోవాలో, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అర్థమవుతుంది. అనుభవం, యువ ఆటగాళ్ల కలయికతో జట్టు ఉండటం చాలా ముఖ్యం. అయితే ఫిట్నెస్ ను వణంగా పెట్టి జట్టును ఎంపిక చేయకూడదు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడాలంటే ఫిట్‌గా ఉండాలి. 35 ఏళ్లు వచ్చినా ఫిట్‌గా ఉంటే వయసుతో సంబంధం లేదు. 24 ఏళ్ల వారికైనా, 35 ఏళ్ల వారికైనా ఫిట్నెస్, ఫామ్ ముఖ్యం. కాబట్టి ఎవర్నీ ప్రశ్నించే అవకాశమే లేదు. అందర్నీ సమానంగా చూడండి. ఫామ్‌లో ఉండి మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులో ఉంటారు. లేకపోతే అవకాశం కోల్పోతారు. చాలా సార్లు తదుపరి ప్రపంచకప్‌కు 3-4 ఏళ్ల సమయం ఉంది కదా? అని అంటుంటారు. ఒకవేళ ఆ ఆటగాడు ఫిట్‌గా లేకపోతే.. ఎప్పుడైనా అతన్ని పక్కనపెట్టవచ్చు. మెరుగైన ప్రదర్శన చేయకపోయినా తొలగిస్తారు. కాబట్టి ఏ వ్యక్తి సెలెక్షన్ గురించి ప్రశ్నలు తలెత్తకూడదు. ఒకే ఒక్క సూత్రం.. బాగా ఆడుతున్నారు, ఫిట్‌గా ఉన్నారంటే ఆడుతూనే ఉండండి.'అని ధోనీ పేర్కొన్నాడు.