సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్‌గా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అందులోను ముఖ్యంగా హీరోయిన్ లకు.. ఎంత అందంగా ఉన్నప్పటికి స్టార్ డమ్ సంపాదించుకోవాలి అంటే తిప్పలు పడాల్సిందే. కొంత మందికి అదృష్టం బాగుండి అవకాశాలు వస్తాయి అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. తన అందం, అభినయంతో సౌత్ నార్త్ ప్రేక్షకులను మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'దో దీవానే షెహర్ మే' విడుదల సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మృణాల్ తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి పాత్రల కోసం దర్శకుల వెంట పడటంలో ఏమాత్రం తప్పు లేదని మృణాల్ స్పష్టం చేశారు.. 'మనం ఒక పాత్ర కోసం ఎంత ఆకలితో ఉన్నామో తెలిస్తేనే దర్శకుల ఆలోచనా విధానం మారుతుంది' అని ఆమె అభిప్రాయపడ్డారు. తన తాజా చిత్రం 'దో దీవానే షెహర్ మే' అవకాశం కూడా అలానే వచ్చిందని ఆమె వెల్లడించారు. దర్శకుడు రవి ఉ ద్యావర్ తెరకెక్కించిన 'మామ్' సినిమా చూసి ఫిదా అయిపోయిన మృణాల్, నేరుగా ఆయన్ని కలిసి.. 'సర్, మనం సినిమా ఎప్పుడు చేస్తున్నాం?' అని అడిగేశారట. ఆమెలోని ఆ ధైర్యమే నేడు ఈ భారీ ప్రాజెక్టులో అవకాశం తెచ్చిపెట్టింది. గతాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘మొదట్లో నాకు పని ఎలా అడగాలో కూడా తెలియదు. 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ గారినే నేను మొదటిసారి అవకాశం అడిగాను. ఒక అవుట్‌సైడర్‌గా నా ముఖం వాళ్లకు కనిపించేలా చేసుకోవడానికి 'సర్, నేను ఇక్కడే ఉన్నాను.. నన్ను ఒకసారి కాస్ట్ చేయండి' అని బతిమిలాడేదాన్ని' అంటూ మృణాల్ ఎమోషనల్ అయ్యారు. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఆమె నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. అరేంజ్డ్ మ్యారేజ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మృణాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.