ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం
కుటుంబంలో ఐదారుగురుంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు
అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం
ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యం
మహిళల అభ్యున్నతికి కూటమి కృషి
వారి అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపకల్పన
ఈ ఏడాది 5 లక్షల మంది మహిళా
పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తాం
రౌడీలు వస్తే రుద్రమదేవిలా ఎదురు నిలవండి
మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు
గుంటూరు: "పెద్ద కుటుంబమే మనకు రక్ష. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తాం. ఇంట్లో ఐదారుగురు ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తాం. అవసరమైతే పెన్షన్ కూడా ఒకటిగా ఎక్కువగా ఇస్తాం. ఇంట్లో పది మంది ఉంటే 60 కేజీల వరకూ రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొన్న ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుస్తూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి అభివాదం చేశారు. అనంతరం చిన్నారులు షర్మిల, మహిమలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 'ఒక కుటుంబం- ఒక వ్యాపారవేత్త' కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన వలు ఏవీలను సభలో ప్రదర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సాధించిన స్ఫూర్తిదాయక విజయగాధలను వివరించారు. సీఎం సహా సభలో పాల్గొన్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏవీలను వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. 'స్త్రీలను గౌరవించి, పూజించిన చోట సంపదకు లోటుండదు. దేశంలోనే మొదటిసారిగా మహిళలకు న్యాయం చేసింది ఎన్టీఆరే. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి దేశానికే మార్గనిర్దేశం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చారు. ఇప్పుడు నేను, మిత్రుడు వవన్ కల్యాణ్, ప్రధాని మోదీ మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళల ప్రాధాన్యం 50 శాతానికి పెరిగింది. మోదీ నేతృత్వంలో త్వరలో చట్టసభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి రాబోతోంది" అని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే..
ఆ ఘనత ఏపీకే దక్కుతుంది
2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగి నష్టపోయాం. పేదలకు న్యాయం చేయాలని, డ్వాక్రా, మెప్మా సంఘాలకు పూర్వ వైభవం తేవాలని నేను, మోదీ, పవన్ కలిశాం. లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పాం. 1.12,686 మంది మహిళలు ఎంఏసఎంఈలు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. రాష్ట్రంలో 84.66 లక్షల మంది డ్వాక్రా సభ్యులుగా, 8.34 లక్షల సంఘాలు ఉన్నాయి. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని సంకల్పించాం. రూ.21 వేల కోట్లు కార్పస్ ఫండ్ కింద మీ వద్ద ఉంది. మెప్మా సంఘాల వారినీ అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం మనదే అవుతుంది. మహిళల ఉత్పత్తుల కోసం 'స్వయం' అనే కొత్త బ్రాండ్ ఇప్పుడే ప్రారంభించాం. అందులో మీ ఫొటోనే ఉంటుంది. 1.10 కోట్ల మంది సభ్యులుగా ఉ న్నారు. ద్వాక్రా సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను 3.30 కోట్ల మంది వినియోగించుకుంటారు. స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చే బాధ్యత మేం తీసుకుంటాం. నాణ్యత ఉండాలి. ప్యాకేజింగ్, రెసిపీ విధానం మెరుగు పరచుకోవాలి. మెషనరీ ఇప్పించే బాధ్యత నాది. ఊళ్లల్లోనే కూర్చుని ఉత్పత్తులు తయారు చన బాధ్యత మహిళలది. మహిళలు స్వయం బ్రాండ్లను అమ్మాలి. స్వయం ఉత్పత్తులనే వినియోగించాలి. డ్వాక్రా మహిళల స్వయం బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. డ్వాక్రా ఉత్పత్తులకు సంబంధించి ఇదే వేదికపై 37 ఎంఓయూలు చేసుకున్నాం. మార్కెట్లు, క్వాలిటీ పెంచడానికి, టెక్నాలజీ వినియోగానికి అవి ఉపయోగపడతాయి.
మహిళాభివృద్ధికి బ్లూ ప్రింట్
మహిళాభివృద్ధికి బ్లూ ప్రింట్కు రూపకల్పన చేశాం. ప్రతీ ఇంటి నుంచి ఎంఎస్ఎం ఈలు ఆవిష్కృతం కావాలి. అందులో 50 శాతం మంది మహిళలే ఉండాలన్నది నా ఆకాంక్ష, హనుమంతుడి శక్తిలా ఆడబిడ్డల శక్తి వారికి తెలీదు. మహిళల్ని శక్తిమంతంగా తీర్చిదిద్దుతాం. మహిళలకు శక్తి సామర్ధ్యాలను ఇచ్చిన పార్టీ టీడీపీనే. ఇంటి స్థలాలు, రుణాలు, సంక్షేమ పథకాలను కూడా వారి పేరిటే ఇస్తున్నాం. మహిళల ఆరోగ్యం పట్ల, ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. రాజకీయాల్లోకి వచ్చాక మేం నిర్వహిస్తున్న కంపెనీని నిర్వహించాలని భువనేశ్వరిని కోరాను. మొదట్లో నిరాకరించినా ఇప్పుడు ఆమె, బ్రాహ్మణితో కలిసి హెరిటేజ్‌ను అద్భుతంగా నడుపుతున్నారు. వారి మాదిరిగానే ప్రతీ ఇంట్లోని ఆడబిడ్డ పారిశ్రామిక వేత్తలుగా ఉండాలి. పీశ ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలకు లక్ష మంది మార్గదర్శుల ద్వారా సాయం అందిస్తున్నాం. మహిళలకు ఏదైనా అవసరమైన వెంటనే మహిళా హోం మంత్రి వెంటనే స్పందిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా హోం మంత్రికి సమాచారం ఇవ్వండి. ఆమె స్పందించకుంటే నాకు చిన్న సమాచారం ఇవ్వండి. తోడు నిలుస్తాం. 2024లో కూటమి వచ్చాక ఎంతమంది బిడ్డలున్నా తల్లికివందనం కింద రూ.15 వేలు ఇస్తున్నాం. స్త్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ రేటు పెరిగినా ఆడబిడ్డలకు 3 సిలిండర్లు ఉచితంగానే అందిస్తా.
మండుటెండలో మహిళల ఇబ్బందులు
దాదాపు గంటన్నర ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.40 గంటల నుంచి 2.40 గంటల వరకూ కొనసాగడంతో మహిళలు ఆకలితో ఇబ్బంది పడ్డారు. ప్రత్యేక భోజన ఏర్పాట్లు లేకపోవడం, వారు వచ్చిన బస్సు వద్దకే భోజనం ప్యాకెట్లు సరఫరా చేయడం కారణంగా అక్కడికి వెళ్లే వరకూ వారికి భోజనం అందలేదు. వాహనాలను సభా ప్రాంగణానికి కిలోమీటరు దూరంలో పార్క్ చేయడంతో ఎండలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
సెల్ఫోన్లపై సెటైర్లు
అభివృద్ధి క్రమంలో మహిళలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ పని కావాలన్నా ప్రజల దగ్గర ఉండే సెల్‌ఫోన్ ద్వారానే చేస్తామని చెప్పారు. సంజీవని యాప్ తీసుకువచ్చి, ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. మితిమీరిన ఫోన్ వినియోగంపై సెటైర్లు వేశారు. ఇంటో ఉన్న నలుగురూ సెల్ఫోన్లలోనే నిమగ్నమైపోతే ఎలాగని ప్రశ్నించారు. ఒకే ఇంట్లో ఉండి ఒకరికొకరు మెసేజ్‌లు పెట్టుకునే విచిత్రమైన పరిస్థితి వచ్చిందని.. మాట్లాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కందుల దుర్గేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్
మహిళా దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనకు ఉంచిన డ్వాక్రా ఉత్పత్తులను ముఖ్యమంత్రి వరిశీలించారు. ఉత్పత్తి నైపుణ్యాలు, మార్కెట్ సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వారికి సలహాలు ఇచ్చారు. చేతితో నేసిన చీరలు, తోలుబొమ్మలు, తాటాకు, గుర్రపుడెక్కతో రూపొందించిన బుట్టలు, మిల్లెట్ ఉత్పత్తుల స్టాళ్లను వరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన శిక్షణతో పులివెందులలో మిల్లెట్ టిఫిన్స్, బిస్కట్లు వంటి ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు ప్రమీల అనే మహిళ సీఎంకు తెలిపారు. చింతపల్లి, లంబసింగి ఏజెన్సీ మండలాల్లో నేచురల్ ఫార్మింగ్ ద్వారా చెర్రీ, టమోట, స్ట్రాబెర్రీ వంటి తోటలకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించారు. శిక్షణ తీసుకుని పెరటికోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్న మహిళ ఏర్పాటు చేసిన స్టాల్ పరిశీలించారు. శక్తి టీం చేవడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ పరిశీలించారు. ఆత్మహత్య చేసుకోబోతున్న తనను ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి టీం సభ్యులు కాపాడారని ఈ సందర్భంగా శిరీష అనే మహిళ సీఎంకు వివరించారు. తనకిప్పుడు మెగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చిందని సంతోషంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆరేళ్ల చిన్నారి నాన్ చాక్ ప్రదర్శనను సీఎం తిలకించి అభినందించారు. స్టాళ్లను ఏర్పాటు చేసిన మహిళల విజ్ఞప్తి మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన న్యూట్రిషన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంథాని వస్త్రాల స్టాల్‌ను పరిశీలించారు.