కెప్టెన్ గా అయ్యర్.. టీమ్ లో కీలక మార్పులు!
గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ తొలిసారి కెప్టెన్సీ
రాహుల్, కాంబోజ్ కూడా దూరం కావడంతో ఇషాన్ కిషన్,
తిలక్ వర్మకు అవకాశాలు బౌలింగ్ లో సిరాజ్, కుల్దీపు చోటు
దక్కే ఛాన్స్ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ న్యూజిలాండ్ జట్టులోనూ పలు కీలక మార్పులు
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కైవసమే లక్ష్యంగా టీమిండియా నాలుగో మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా జరగనున్న ఈ పోరులో భారత్‌కు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్టు సిరీస్ సన్నాహాల కోసం వెళ్లడంతో అతడికి ఈ బాధ్యతలు దక్కాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 అధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. గిల్ నాయకత్వంలో వన్డే టీమ్ ను తొలి మూడు మ్యాచ్ లకు మాత్రమే ఎంపిక చేశారు. ఇప్పుడు మిగతా రెండు మ్యాచ్ లలో భారత్ కు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. గిల్ తో పాటు కేఎల్ రాహుల్, అన్షుల్ కాంబోజ్ కూడా నాలుగో వన్డేకు అందుబాటులో ఉండరు. వీరి స్థానాల్లో తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర, యశ్ ఠాకూర్ జట్టులో చేరారు. తొలి మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కి పరిమితమైన ఇషాన్ కిషన్ ఈసారి తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మతో కలిసి అతడు ఓపెనింగ్ చేసే అవకాశముంది. రాహుల్ స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా ఇషానే చేపట్టే ఛాన్స్ ఉంది. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ నెలకొంది. తిలక్ ఈ పర్యటనలో ఇప్పటికే టీ20 మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఇండియా-ఏ తరఫున న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక టెస్టులో హాఫ్ సెంచరీ చేశాడు. గైక్వాడ్‌కు కూడా గతంలో వన్డేల్లో మిడిలార్డర్ ఆడిన అనుభవం ఉంది. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తొలి మూడు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. కాంబోజ్ దూరం కావడంతో వీరిలో ఒకరికి అవకాశం లభించనుంది. అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నవీలలో ఒకరికి విశ్రాంతి ఇస్తే సిరాజ్, కుల్దీప్ ఇద్దరికీ చోటు దక్కవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులోనూ పలువురు కీలక ఆటగాళ్లు టెస్టు సన్నాహాల కోసం వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ జట్టు కొత్త కూర్పుతో బరిలోకి దిగనుంది. మ్యాచ్ వివరాలు: నవంబర్ 13, శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం, సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.