నేడు వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు
మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వేదికగా కార్యక్రమం
ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్ లోకి నీటి విడుదల
కృష్ణమ్మకు నేడు సీఎం జలహారతి..
పైలాన్ ఆవిష్కరణ అనంతరం ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగం
నేడు మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర: సీఎం ట్వీట్
ముప్పై ఏళ్ల కల సాకారం కాబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించమన్నారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వేదికగా ప్రాజెక్టు తొలిదశను ఆవిష్కరిస్తారు. ఫీడర్ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని నల్లమలసాగర్ జలాశయంలోకి విడుదల చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలకు జలహారతి ఇస్తారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నవ్యాంధ్ర సీఎంగా అదే ప్రాజెక్టును జాతికి అంకితం చేయనుండటం విశేషం. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు... ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే జీవనాధార ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి, ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. 53 టీఎంసీల సామర్థ్యం గల వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలలోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా సుమారు 23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం చేకూరనుంది.
తొలిదశతో కొత్త అధ్యాయం
ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేయనున్నారు. తొలి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో దశ పూర్తయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. వెలిగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంతంలో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. 1996లో శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ఎన్నో సాంకేతిక, ఆర్దిక, నిర్మాణ పరమైన సవాళ్లు ఎదురయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని పనులను వేగవంతం చేసింది. టన్నెల్ పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, ఇతర అనుబంధ నిర్మాణాలతో పాటు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం 48 రోజుల వ్యవధిలో నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం చెల్లించింది. అంతేకాకుండా గెజిట్, జాబితాలో పేర్లు లేని వారికోసం మరో రూ. 169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్ల నిండిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. 30 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం ఇప్పుడు సాకారమవుతుండటంతో నాలుగు జిల్లాలలో ముఖ్యంగా మార్కాపురం ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్కాపురం జిల్లా గడ్డపై సోమవారం కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ సీఎం చంద్రబాబు ఆదివారం ట్వీట్ చేశారు. నల్లమలకొండలను చీల్చుకుంటూ నల్లమలసాగర్‌లో కి వెళ్లే కృష్ణా జలాలు ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించే అవకాశం తనకు రావడం తన మనసుకు ఎంతో సంతోషానిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం 10.15గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండ లం గంటవానిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ను ప్రారంభించి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం గంటవానిపల్లిలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.