ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఆయన ప్రభుత్వ అధినేతగా అప్రతిహతంగా పాతికేళ్లుగా కొనసాగుతున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంపై మోదీ స్పందించారు.
మోదీ తన రాజకీయ ప్రస్థానాన్ని 2001, అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. ఆ రోజున ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి, 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు.
ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే, 2014 మే 26న, ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు 11 ఏళ్లకు పైబడి ఆయన ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతూ దేశానికి సేవ చేస్తున్నారు. ఈ దీర్ఘకాలిక, నిరంతరాయమైన ప్రయాణాన్ని సూచిస్తూ, మోదీ ప్రభుత్వ అధినేతగా 25వ ఏట అడుగుపెడుతున్నారు.
ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, ఇంత గొప్ప దేశం పురోగతిలో పాలుపంచుకోవడానికి తాను నిరంతరాయంగా కృషి చేస్తున్నానని తెలిపారు.
“2001లో ఇదే రోజు తొలిసారి గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశాను. మొదట స్వరాష్ట్రంలో.. ఇప్పుడు దేశంలో మార్పులకు శ్రమిస్తున్నాను. సహచర భారతీయులు నిరాటంకంగా ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రభుత్వాధినేతగా 25వ ఏట అడుగుపెడుతున్నాను. భారత ప్రజలకు కృతజ్ఞుడిని” అని ఆయన పేర్కొన్నారు.
పాలనా సంక్షోభం నుండి ప్రపంచ శక్తిగా
2013లో లోక్సభ ఎన్నికలకు బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసేనాటికి, దేశం పాలన మరియు విశ్వాస సంక్షోభంలో పడి ఉందని మోదీ గుర్తుచేశారు. యూపీఏ హయాంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, విధాన పక్షవాతంతో భారత్ విలవిలలాడిందని మోదీ విమర్శించారు.
అయితే, నేడు భారత్ రూపురేఖలు మారాయని, ఇది ఇప్పుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థకు నెలవుగా ఉంది. సామాజిక భద్రత పథకాలకు నిలయంగా మారింది. ఆత్మనిర్భర్ భారత్ దిశగా పయనం దేశం అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి (ఆత్మనిర్భర భారత్) సాధించేందుకు ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపడుతోందని ప్రధాని వివరించారు. ఈ కృషి అంతా ఇది స్వదేశీ వస్తువని గర్వంగా చెప్పండి అన్న నినాదంలో ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
తన పాలనలో జరిగిన పరివర్తనలు, విప్లవాత్మక చర్యలను మోదీ ప్రస్తావించారు.
11 ఏళ్లుగా భారత ప్రజలందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నారీశక్తి, యువ శక్తి, అన్నదాతలను సాధికారత దిశగా నడిపిస్తున్నాం. 25 కోట్ల మందికిపైగా ప్రజలను పేదరికం నుంచి విముక్తం చేశాం. భారత్ ఇప్పుడు ప్రధాన ప్రపంచ ఆర్థిక శక్తుల నడుమ చోటు సంపాదించింది. దేశం స్వావలంబన సాధించేందుకు మన రైతులు కొత్త పుంతలు తొక్కుతున్నారు” అని మోదీ పేర్కొన్నారు.