నియామక ప్రక్రియ వివరాలన్నీ ఆన్ లైన్లోనే డీఎస్సీపై వైసీపీవి హిట్ అండ్ రన్ చర్యలు
ఒడిశా కూలీలు, 90 ఏళ్ల జగన్ జెన్జీలతో ఫేక్ ప్రదర్శనలు
ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని వైసీపికి సవాల్
శాసనసభలో మెగా డీఎస్సీ నియామకాలపై సీఎం చంద్రబాబు ప్రసంగం
మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ పారదర్శకంగా ఆన్ లైన్లోనే ఉ ంచామన్నారు. వైసీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని మేం విశ్వసించాం. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నాం. ఐటీని ప్రోత్సహించటం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశాం. విద్య రంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించింది. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది మొదట ఎన్టీఆరే. నేను సీఎం అయిన తొలినాళ్లలోనే ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల లేకపోవటంపై తక్షణ చర్యలు తీసుకున్నాం. ప్రతీ కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతీ మండలానికి ఓ జూనియర్ కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజిని ఏర్పాటు చేశాం. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఉపాధ్యాయుల నియామకాలు చేయని 2019-24 మధ్య ఉన్న పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పటి వరకూ 14 డీఎస్పీలు జరిగితే, టీడీపీ, ఎన్డీయే హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. పాఠశాలలకు విద్యార్థుల హాజరు పెంచాలనే లక్ష్యంతో గతంలో డ్రై రేషన్ కూడా అందించాం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీనే ప్రవేశపెట్టింది. ఇంటర్ విద్య వరకూ ఈ పథకాన్ని విస్తరించాం. మహిళలకు విద్యలో కూడా రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నాం. ఉపాధ్యాయుల బదిలీని పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకువచ్చాం. గడచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణల ద్వారా మార్పులు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలు సహా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. 2019-24 మధ్య 10-12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు రావటం మానేశారు. అందుకే తల్లికి వందనం పేరిట పిల్లలందరికీ ఆర్థికసాయం అందించేలా మేం నిర్ణయం తీసుకుని అమలు చేశాం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచటంతో 1 లక్ష మందికి పైగా విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చారు. "అని ముఖ్యమంత్రి అన్నారు.
డీఎస్సీ నియామక ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే
"గత పాలకులు 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ నియామకాన్ని కూడా చేపట్టలేదు. మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశాం. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టాం. 13 నబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించాం. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేశాం. పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశాం. జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల్నే అమలు చేశాం. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు. మెగా డీఎస్సీ ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని టీచర్లు చెప్పారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్ లైన్లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది.? ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఎఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్లో నియామక ప్రక్రియలో ఒక్క డీవియేషన్ కూడా లేదు. లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు వందల కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. అధికారికంగా వివరణ ఇచ్చినా రోజుతో కుట్ర చేస్తూనే ఉన్నారు. డీఎస్సీపై గొడ్డలిపార్టీ ఒడిశా కూలీలతో,90 ఏళ్ల జగన్ జెన్ జీ వ్యక్తులతో ధర్నాలు చేయించింది. ఈ ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు టీచర్లే రోడ్డుపైకి వచ్చారు. మొన్న కర్నూలులో, నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున టీచర్లు ఆందోళన చేశారు. పిల్లలకు పాఠాలు చెబుతాం, ప్రతిభను కించ పరిస్తే గుణపాఠం కూడా చెబుతామని వారు నినదించారు' అని ముఖ్యమంత్రి అన్నారు.
అసెంబ్లీకి రాకుండా పజ్జీలు"
మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ, కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసురుతున్నాను. అసెంబ్లీకి వస్తే అడ్డంగా దొరికిపోతారనే వాళ్లు రావటం లేదు. రోడ్డుపై హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారు.
నియామకాలు జరిగాయి. రాష్ట్రంలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉ ద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నాను. పూర్తి పారదర్శకతతో బాధ్యతతో, పూర్తి జవాబు దారీతనంతో విద్యావిధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తాం. సిగ్గులేని ఆ పార్టీ అసెంబ్లీకి రాకుండా బయట పడ్డీలు ఆడుకుంటున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు శాసనసభకు వచ్చి డిమాండ్ చేయాలి. రెండున్నర ఏళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం నా జీవితంలో ఇదే తొలిసారి. అసెంబ్లీకి రాకుండానే జీతాలు, ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు. అనే నేనుగా నాకు ప్రజలపై పూర్తి బాధ్యత ఉంది. వారికి ఏముందో ప్రజలే చెప్పాలి."అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
50 ఏళ్లలో గ్రూప్-1 లాంటి స్కామ్ చూడలేదు
అసెంబ్లీలో దీనిపై చర్చిస్తాం: సిఎం చంద్రబాబు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి తప్పిదాన్ని చూడలేదన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదని వ్యాఖ్యానించారు. ఆ కుంభకోణంలో ఎంతోమంది మెరిట్ విద్యార్థులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని అన్నారు. బుధవారం సభలో అన్ని విషయాలు చర్చిస్తామని సీఎం పేర్కొన్నారు. డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువమంది ఉన్నారని ప్రస్తావించారు. ఆదివారం విజయవాడలో ఉపాధ్యాయులు నిర్వహించిన ఆందోళనలో వారు బాగా మాట్లాడారని తెలిపారు. ఆత్మాభిమానంతోనే ఆత్మగౌరవం కాపాడుకునేందుకు అంతమంది టీచర్లు వచ్చారని అన్నారు. వారి ఆత్మగౌరవాన్ని వైసీపీ నేతలు దెబ్బతీస్తోండటంతో సహించలేక రోడ్డు ఎక్కారని చెప్పారు. మహిళా టీచర్లకు డీఎస్సీతో, ఆ పక్రియతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఉ ందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.