రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ డివోషనల్ ఎంటర్టైనర్ 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పాటల్లో, టీజర్ లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించారు. దీంతో ఈ చిత్ర కథపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. శబరిమల బ్యాక్ డ్రాప్ ఇది రానుందని ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. శబరిమల దేవాలయానికి ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కథకు శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు.సినిమాలో కథానాయకుడి జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఒక భాగం మాత్రమే. దీక్షా కాలంలో అయ్యప్ప భక్తులు తమ నియమావళి, అలవాట్ల విషయంలో చాలా నిష్టగా ఉంటారు. వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి ఈ దీక్ష తీసుకోవాల్సి వస్తే.. అతడు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అక్కడే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. కఠినమైన నియమాలు ఉండాలి కాబట్టే నేను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అంతే తప్ప ఇది శబరిమలకు సంబంధించిన కథ కాదని ఆయన పేర్కొన్నారు ఈ 41 రోజుల కథే స్క్రీన్‌ప్లేకి ప్రధాన బలంగా నిలుస్తుంది. అది సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఆ దీక్షకు ముందు ఏం జరిగింది.. దీక్షలో ఉన్న సమయంలో ఏం జరిగిందనే విషయాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని శివ నిర్వాణ తెలిపారు. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.