అక్టోబర్ నుంచి మళ్లీ సెట్స్‌పైకి ఎన్టీఆర్
టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'డ్రాగన్'. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌కు భుజానికి గాయం కావడం, దాని కోసం ఆయన ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవడం తెలిసిన విషయమే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న ఆయన, తిరిగి ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటారనే దానిపై తాజా సమాచారం అందింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఎన్టీఆర్ అక్టోబర్ మొదటి వారం నుంచి డ్రాగన్' చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. గాయం కారణంగా సినిమా షూటింగ్‌కు అనుకోని బ్రేక్ వచ్చింది. అయితే, ఈ విరామాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్ధంగా వాడుకున్నారు. ఎన్టీఆర్ అవసరం లేని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. ఇప్పటివరకు దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పుడు ఎన్టీఆర్ తిరిగి సెట్‌పైకి రానుండటంతో మిగిలిన భాగాన్ని ఏకథాటిగా పూర్తి చేసేందుకు భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నాన్ స్టాప్ కొనసాగనుంది. ఈ సుదీర్ఘ షెడ్యూల్లోనే డ్రాగన్' పార్ట్ 2కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీక్వెన్స్‌లను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తన డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్లతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని సరికొత్త పాత్రలో, భారీ స్థాయిలో ఈ సినిమాలో కనిపించనున్నారు. అంతర్జాతీయ ఓపియం, హెరాయిన్ వాణిజ్యంపై ఆధిపత్యం కోసం జరిగే భీకరమైన యుద్ధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన క్రూరమైన హంతకుడు 'లూగర్'గా ఎన్టీఆర్ లుక్ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బిజూ మీనన్, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.