అనకాపల్లి, : జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ పదేపదే నేరాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిపై పిట్ ఎన్టీపీఎస్ చట్టం- 1988 కింద ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు అమలు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు. గొలుగొండ మండలం పాత కృష్ణదేవిపేట గ్రామానికి చెందిన ఉప్పాటి వెంకటేశ్ (23) గంజాయి అక్రమ రవాణాలో అలవాటుపడిన నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో ఒకటి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో రెండు, అన్నవరం పోలీస్ స్టేషన్లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు గంజాయి కేసులు నమోదయ్యాయి. గతంలో గంజాయి కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లినా వెంకటేశ్ తన నేర ప్రవృత్తిని మార్చుకోలేదని పోలీసులు పేర్కొన్నారు. వరుసగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ ప్రజల శాంతిభద్రతలకు, యువత భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో అతనిపై పిట్ ఎన్టీపీఎస్ చట్టం కింద ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎన్డీపీఎన్ సెల్ ఇన్స్పెక్టర్ పిల్లా రమేష్, కృష్ణదేవిపేట ఎస్పై వి. రుషికేశ్వరరావు, సిబ్బంది సమన్వయంతో సోమవారం నిర్వహించిన చర్యల్లో వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. జిల్లాలో గంజాయి సాగు, నిల్వ, కొనుగోలు, విక్రయాలు, రవాణాకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగుతుందని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పిట్ ఎన్టీపీఎస్ చట్టం, పీడీ చట్టం వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.