టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర
25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం
అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలి
భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత
వాహన సేవల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలి
సాలకట్ల బ్రహ్మోత్సవాల లోటుపాట్లు పునరావృతం కాకుండా చర్యలు
తిరుమల, : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన అదనపు ఈవో సి, హెచ్, వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర ఉ న్నతాధికారులతో కలిసి సోమవారం అన్నమయ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో గతంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. ఇటీవల జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని విభాగాలు, పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల భక్తులకు ప్రశాంతంగా దర్శనం కల్పించగలిగామని, అదే సమన్వయ స్పూర్తిని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించాలని సూచించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎదురైన చిన్నచిన్న లోటుపాట్లను గుర్తించి, అవి వునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్నవసాదం, వైద్య సేవలు పారిశుధ్యం, రవాణా, పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, విజిలెన్స్, పోలీసుల భద్రత తదితర ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని వాహన సేవలను వీక్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. సమావేశంలో టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, టీటీడీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పోలీసు, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.