ఫహద్ ఫాజిల్ నటనకు మహేష్ బాబు ఫిదా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాను చూసిన మహేశ్.. ఫహాద్ అద్భుతమైన సటుడంటూ కొనియాడారు. సినిమా తనకు ఎంతో అందమైన అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. సినిమాను చూసిన అనంతరం మహేశ్ బాబు బుధవారం తన 'ఎక్స్' ఖాతాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ఎంతో చక్కగా రూపొందిన సినిమా అని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో వినోదాన్ని అందిస్తూనే మనసును హత్తుకునేలా ఉందని అన్నారు. సినిమా మొత్తం ఒక ప్రత్యేకమైన ఆప్యాయత కనిపిస్తుందని ప్రశంసించారు. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫహాద్ ఫాజిల్, బాలనటి సారాను మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఫహాద్ నటుడిగా ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయోగాలు చేస్తూ తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఫహాద్, చిన్నారి సారా కలిసి అద్భుతంగా నటించారని మహేశ్ ప్రశంసించారు. సినిమాలో వారి పాత్రలు జీవిస్తున్నట్లు, ప్రతి క్షణాన్ని అనుభవిస్తున్నట్లు కనిపించిందని పేర్కొన్నారు.