సర్ ప్రక్రియతో ప్రజాస్వామ్యం పూర్తిగా ధ్వంసం
సీఈసీ రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలి
మోదీ, షా, జ్ఞానేష్ కుమార్‌పై విచారణ జరపాలి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్
ఈసీపై మరోసారి రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
నేటినుండి సర్‌పై ఇండియా కూటమి ఆందోళనలు
న్యూఢిల్లీ : అసలు ఫామ్ 6లో మార్పులకు ఆదేశాలు ఎవరి నుంచి వెళ్లాయి, ఎవరు వీటిని ఆమోదించారు, ఇందులో సాఫ్ట్ వేర్ నిర్వహిస్తున్న టీసీఎస్ పాత్ర ఎంత అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై ఇవాళ వివక్ష నేత రాహుల్ గాంధీ ఈసీతో పాటు టీసీఎస్ ను కూడా ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఫామ్ 6లో చేసిన మార్పులకు ఎవరి నుంచి ఆదేశాలు వెళ్లాయి, వాటిని ఎవరు ఆమోదించారంటూ ప్రశ్నించారు. అలాగే టీసీఎస్ లో ఈ మార్పులకు ఎవరు ఆమోదం తెలిపారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆన్లైన్ 'ఫారం 6' చట్టవిరుద్ధంగా మార్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిని స్వయంగా ఎన్నికల సంఘలో కమిషనర్ల అభ్యంతరంగా నమోదు చేశారని రాహుల్ గుర్తుచేశారు. ఆ మార్పులు చేయమని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను ఎన్నికల సంఘంలో ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు. టీసీఎస్ లో ఎవరు దీనికి ఆమోదం తెలిపారని కూడా అడిగారు. అలాగే, అలా చేయడానికి వారిపై ఒత్తిడి తీసుకువచ్చారా అని కూడా రాహుల్ గాంధీ వరుసగా ప్రశ్నలు సంధించారు. దీంతో టీసీఎస్ కూడా ఈ వ్యవహారంలో జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఎదు-రవుతోంది. ముఖ్యంగా ఈసీ నుంచి తమకు వచ్చిన ఆదేశాలు, వాటి అమలుకు సంస్థలో ఎవరు ఆమోదం తెలిపారన్న అంశాల్ని ఇప్పుడు టీసీఎస్ బయటపెడుతుందా లేక ఈసీ పైనే నెపం వేసి తప్పించుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఈ సర్ ప్రక్రియను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ముగ్గురూ కలిసి సర్ ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని, ఇది దేశద్రోహం కిందికే వస్తుందని ఆరోపించారు. ఇదే సమయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలని, మోదీ- షా ద్వయంపై దర్యాప్తు జరగాలని కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కర్ణాటక బెళగావిలో ఓటర్ల పేర్ల తొలగింపు కుట్రకు సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో కేవలం 3 రోజుల్లోనే బెళగావిలో సుమారు 15 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి సంబంధించి వేలాది ఫారం- 7 దరఖాస్తులు వెల్లువెత్తాయని, ఎక్కువగా బీజేపీని వ్యతిరేకించే ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓవీసీ వర్గాలకు చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని గతంలో చేసిన ఆరోపణల్ని రాహుల్ మరోసారి ప్రస్తావించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి ఎఫ్ఆర్ నమోదు చేయాలని కోరుతున్నారని, అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సర్ ప్రక్రియపై బుధవారం రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 19 రాజకీయ పార్టీల నేతలు సుదీ-ర్షంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 2-8 మధ్య జిల్లాల స్థాయిలో సేవ్ డెమోక్రసీ మార్చ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలంతా కలిసి కేంద్ర ఎన్నికల సంఘం. కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయాలని కూటమి నిర్ణయించింది. రాబోయే ఎన్నికలన్నింటినీ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. సర్ ప్రక్రియకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న కేసుల్ని వేగవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతోంది.