కీవ్ : చమురు కేంద్రాలపై దాడే లక్ష్యంగా రష్యాలోని పలు ప్రాంతాలతో పాటు ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం, అజోవ్ సముద్రం ఏరియాలపై ఉక్రెయిన్ సోమవారం రాత్రి డ్రోన్ల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన దాదావు 900 డ్రోన్లను తమ దళాలు కూల్చివేశాయని రష్యా వెల్లడించింది. ఈ డ్రోన్ దాడిలో మాస్కో రీజియన్ లోని ఇంధన డిపో ఒకటి మంటల్లో చిక్కుకుందని, ఇద్దరు మరణించారని తెలుస్తోంది.
సౌదీలోని రెండు ఎయిర్‌పోర్టులపై హుతీల దాడులు
న్యూఢిల్లీ: హుతీలు తమ దేశంలోని రెండు ఎయిర్‌పోర్టులు జాజన్, నజ్రాన్ ఎయిర్‌పోర్టులపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారని, ఈ దాడుల వల్ల ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని సౌదీ అరేబియా మంగళవారం ప్రకటించింది. ఈ రెండు ఎయిర్‌పోర్టులు యెమెన్ సరిహద్దులకు దగ్గర్లో ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, యెమెన్‌లో హుతీలు, ప్రభుత్వ బలగాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. బాబ్-ఎల్-మాండేజ్ జలసంధిలో కీలకమైన పోర్టు సిటీ మోకాను, అలాగే అల్-తుర్బా పట్టణాన్ని హుతీల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రకటనను హుతీలు ఖండించారు.
హోర్ముజ్‌లో నౌకపై క్షిపణి దాడి
11 మంది భారతీయులకు గాయాలు
న్యూఢిల్లీ: పనామా పతాకంతో ఉన్న వాణిజ్య నౌకపై మంగళవారం ఉదయం హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది భారతీయ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. "వాణిజ్య నౌకలు, నౌకా సిబ్బంది, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు ముగింపు పలకాలి. అదేవిధంగా అంతర్జాతీయ జలమార్గంలో పూర్వస్థితిని పునరుద్ధరించాలి." అని విదేశాంగ శాఖ పేర్కొంది. 'ఎమ్.టీ. ఆన్ పీస్'.. వాణిజ్య నౌకపై దాడి జరిగిన సమయంలో 19 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 17 మంది భారతీయులు ఉన్నారని కేంద్రం తెలిపింది. వీరిలో 11మంది గాయపడ్డారని పేర్కొంది.