ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్లో లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించగా, 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమా మాత్రం 'బాహుబలి' కాదని రాజమౌళి వెల్లడించారు. తనలో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిన చిత్రం 'ఈగ' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఆయన తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ప్రేక్షకులు తన కెరీర్ను 'బాహుబలి'కి ముందు, తర్వాత అని విభజించి చూస్తారని, కానీ తన దృష్టిలో మాత్రం ఈగకు ముందు, తర్వాత అనే విభజన ఉంటుందని తెలిపారు. 'ఈగ తన కెరీర్లో చేసిన అతిపెద్ద ప్రయోగమని రాజమౌళి చెప్పారు. ఒక ఈగను ప్రధాన పాత్రగా తీసుకుని, దాని చుట్టూ భావోద్వేగాలతో కూడిన కథను నడిపించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని వివరించారు. ఆ సినిమా తనకు అందించిన సంతృప్తి మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎన్ని సినిమాలు తీసినా 'ఈగ' తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని స్పష్టం చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. భారీ స్థాయి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిన సినిమాగా 'ఈగను పేర్కొనడం విశేషం. మరోవైపు మహేశ్ బాబుతో రూపొందిస్తున్న 'వారణాసి'పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.