రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన టీమిండియా, పసికూన జపాన్ చేతిలో ఓటమి అంచులదాకా వెళ్లింది. సానో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో, ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కేవలం 2 వరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా అంతర్జాతీయ టీ20ల్లో 200వ విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ ఓవర్ విజయాలతో కలిపి భారత్ ఈ మైలురాయిని అందుకుంది. దాదాపు రెండున్నర గంటల ఆలన్యం తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న జపాన్ స్పిన్నర్లు భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ (0) తొలి బంతికే ఔట్ కాగా, ఇషాన్ కిషన్ (3), సంజూ శాంసన్ (9) విఫలమయ్యారు. కెప్టెన్ అయ్యర్ (16) కాస్త ఫర్వాలేదనిపించడంతో భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (1) నాటౌట్‌గా నిలిచాడు. జపాన్ బౌలర్లలో చార్లీ హింజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కేవలం 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్, భారత జట్టుకు చుక్కలు చూపించింది. తమ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం నమోదు చేసే దిశగా సాగింది. అయితే, కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసి జపాన్ జోరుకు బ్రేకులు వేశాడు. అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచాడు. దీంతో జపాన్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.
ఈ మ్యాచ్ లో ఓ వివాదాస్పద ఘటన కూడా చోటుచేసుకుంది. జపాన్ ఛేదనలో నాలుగో ఓవర్లో అంపైర్ వైడ్ ఇవ్వగా, బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడని కెప్టెన్ అయ్యర్, బౌలర్ అక్షర్ వాదించారు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఓటమి పాలైనప్పటికీ, ఆసియా క్రీడల ముందు జపాన్ ప్రదర్శన వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్ లో ఓటమి నుంచి త్రుటిలో తప్పించుకుని గట్టెక్కింది.
జపాన్ తో మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
జపాన్‌తో మ్యాచ్ కోసం తాము సుదీర్ఘ ప్రయాణం చేశామని, చివరకు స్టేడియానికి చేరుకోవడానికి ఏకంగా మూడు గంటలు పట్టిందని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నాడు. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తైన సందర్బంగా ఈ మ్యాచ్ నిర్వహించడం ప్రత్యేకమని పేర్కొన్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఐదు ఓవర్లకే పరిమితమైనా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని చెప్పాడు. జపాన్ జట్టు ఆటతీరుపై అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఆ జట్టు చూపించిన పోరాట పటిమ అద్భుతంగా ఉందని అన్నాడు. "జపాన్ జట్టు చూపించిన వైఖరి అద్భుతం. వాళ్లు సరైన దారిలోనే వెళ్తున్నారు" అని పేర్కొన్నాడు. సానోలోని కఠినమైన పిచ్పి ఆడటం తమకు కూడా మంచి ప్రాక్టీస్ ఉపయోగపడిందని చెప్పాడు. "బంతి బాగా తిరుగుతోంది. వేగంలోనూ మార్పులు ఉన్నాయి. బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అందుకే సింగిల్స్, డబుల్‌పై దృష్టి పెట్టా. ప్రతి బంతిని దాని మెరిట్ ప్రకారం ఆడాలని నిర్ణయించుకున్నా" అని అయ్యర్ వివరించాడు. ఐదు ఓవర్ల మ్యాచ్‌లో ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారిపోతాయని అయ్యర్ అన్నాడు. బాధ్యత పెరిగినప్పుడు ఒత్తిడి కూడా ఉ ంటుందని, అయితే తాను ఒత్తిడిని ఆస్వాదిస్తానని చెప్పాడు. ముందుగా ఒక్కో అడుగు చొప్పున ముందుకెళ్లాలని, ఆసియా క్రీడల వేదికకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులను అంచనా వేసి తమ వ్యూహాలను నిర్ణయించుకుంటామని పేర్కొన్నాడు. భారత్, జపాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించబడింది. తొలుత భారత్ 32/4 పరుగులు చేయగా.. జపాన్ 30/3 వద్ద నిలిచింది. దీంతో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 12 బంతుల్లో 16 పరుగులతో భారత తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.