టీమిండియా స్టార్ పేసర్ ఆర్ష దీప్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రముఖ మోడల్, సినీ నటి సమ్రీన్ కౌర్ ముందు తన ప్రేమను వ్యక్తపరిచాడు. బుధవారం (నవంబర్ 11) న్యూజిలాండ్‌లో అర్షదీప్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేయగా, ఆమె “యస్" అని చెప్పడంతో ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలను అర్షదీప్, సమ్రీన్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. సమ్రీన్ ఈ సందర్భంగా ఒక భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు. "జీవితం మాకు ఇచ్చిన వాటన్నింటికంటే ఒకరినొకరం దక్కించుకోవడమే నాకు అత్యంత సంతోషాన్నిచ్చింది. జీవితాంతం కలిసి ఉండే ప్రయాణం మొదలైంది. 11.11.2026 (హాయ్ ఫియాన్సీ) అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం భారత వన్డే జట్టు పర్యటనలో భాగంగా అర్షదీప్ న్యూజిలాండ్ లోనే ఉన్నాడు. అక్కడే తన ప్రియురాలి ప్రేమను గెలుచుకుని పెళ్లి దిశగా ముందడుగు వేశాడు. వీరిద్దరి బంధం గురించి ఇప్పటికే క్రీడా వర్గాల్లో చర్చ సాగింది. ఈ ఏడాది జులై ఆఖర్లో అర్ష్ దీప్ “మై పర్సన్” అనే క్యాప్షన్‌తో సమ్రీన్ ఫొటోలను పంచుకుని తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతకుముందు ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సందర్భంగా వీరిద్దరూ కలిసి చేసే డ్యాన్స్ స్టెప్‌తో అర్షదీప్ సంబరాలు చేసుకుని, ఆ ఘనతను ఆమెకే అంకితం ఇచ్చారు.
ఎవరీ సమ్రీన్ కౌర్?
జమ్మూకశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ మోడల్, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచారు. భారత క్రికెట్ జట్టు చారిత్రక విజయం ఆధారంగా తెరకెక్కిన '83' సినిమాలో సమ్రీన్ నటించారు. అలాగే జీ5 వెబ్ సిరీస్ 'నెయిల్ పాలిష్', పంజాబీ చిత్రం 'సర్దార్ జీ 2'లలోనూ ముఖ్య పాత్రలు పోషించారు. గురు రంధావా, బాద్, జుబిన్ నౌటియాల్ వంటి ప్రముఖ గాయకుల మ్యూజిక్ వీడియోలలో కూడా నటించి విశేష ఆదరణ దక్కించుకున్నారు.