రూ.72 లక్షల దుర్వినియోగం..
రూ.22 లక్షలు రికవరీ ఆసుపత్రికి
రూ.15 లక్షల విలువైన కంప్యూటర్లు విరాళం.
ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి, : స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ నిధుల వ్యవహారంపై విజయవాడకు చెందిన ప్రత్యేక ఆడిట్ కమిటీ ఆగస్టు 28న ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించిందన్నారు. విచారణలో గత ప్రభుత్వ హయాంలో ఆనుపత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన లక్ష్మీ ప్రసన్న సుమారు రూ.72 లక్షల ఆరోగ్యశ్రీ నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలిందని తెలిపారు. ఇప్పటికే రూ.22 లక్షలు రికవర్ చేయగా, మిగిలిన రూ.50 లక్షల రికవరీతో పాటు చట్టపరమైన చర్యల కోసం శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఈ వ్యవహారంతో ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా వారిపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి సాంకేతిక అభివృద్ధికి కోకాకోలా (థమ్స్ అప్) వరిశ్రమ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా రూ.15 లక్షల విలువైన 15 ఆధునాతన కంప్యూటర్ వ్యవస్థలను విరాళంగా అందించింది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళికి కంప్యూటర్లను అందజేశారు. ఆసుపత్రిని అన్ని రంగాల్లో ఆధునీకరించి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. డిజిటల్ సేవలను వేగవంతం చేయడంతో పాటు రోగుల వివరాలు, వైద్య రికార్డుల నిర్వహణకు కంప్యూటర్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి దాతలు, పారిశ్రామిక సంస్థలు ముందుకు రావాలని కోరుతూ కంప్యూటర్లు అందించిన కోకాకోలా పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆనుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.