భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కెరీర్లోనే అత్యుత్తమంగా 817 రేటింగ్ పాయింట్లకు చేరుకుంది. దీంతో 2018 నవంబర్‌లో ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ సాధించిన 806 పాయింట్ల రికార్డును అధిగమించింది. మహిళల టీ20 క్రికెట్లో మరే బౌలర్ ఇప్పటివరకు ఈ స్థాయిలో రేటింగ్ అందుకోలేదు. ఇప్పటికే టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఉన్న చరణి.. ఇప్పుడు ఆ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో చరణి అద్భుతంగా రాణించింది. జపాన్‌పై 4/10తో కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. అనంతరం శ్రీలంకతో జరిగిన స్వర్ణ పతక మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్‌లోనూ చరణి కీలక పాత్ర పోషించింది. టోర్నీలో 12 వికెట్లు తీసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 4/20తో అదరగొట్టింది. దీంతో భారత్ 72 వరుగుల తేడాతో విజయం సాధించి ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ దక్కించుకుంది. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత మరో స్టార్ దీప్తి శర్మ కూడా ముందుకు వచ్చింది. ఆసియా క్రీడల ఫైనల్లో మూడు వికెట్లు తీసుకున్న ఆమె 754 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ 723 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన కూడా టాప్-5లోకి తిరిగి వచ్చింది. ఆసియా క్రీడల ఫైనల్లో శ్రీలంకపై 79 పరుగులు చేయడంతో ఆమెకు ఈ స్థానం దక్కింది.