గువాహటిలో కోహ్లి సెంటిమెంట్‌తో భారత్!
రెండో వన్డేలో సిరీస్ గెలుపే భారత్ లక్ష్యం
గువాహటిలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లూ గెలిచిన భారత్
రెండు మ్యాచ్ ల్లోనూ కోహ్లి సెంచరీ రోహిత్ సైతం ఓ సెంచరీ,
ఓ హాఫ్ సెంచరీ ధ్రువ్ జురెల్, యశస్వికి చోటు దక్కే ఛాన్స్
వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా శతకంతో ఆకట్టుకోవడంతో భారత్ 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. గువాహటి భారత్‌కు కలిసొచ్చిన మైదానం, ఇక్కడ ఆడిన రెండు వన్డేల్లోనూ టీమిండియా గెలిచింది. కోహ్లి ఈ రెండు మ్యాచ్‌లోనూ సెంచరీలు చేయగా, రోహిత్ శర్మ కూడా ఓ సెంచరీ, ఓ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ వేదికపై జరిగిన నాలుగు వన్డే ఇన్నింగ్స్ ల్లోనూ 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. దీంతో మరోసారి బ్యాటర్లదే ఆధిపత్యంగా సాగే అవకాశం కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో మార్పులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ బెంచ్ కే పరిమితమయ్యారు. ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వడంతో పాటు యశస్వి జైస్వాల్‌ను కూడా ఆడించే ఆలోచన ఉండొచ్చని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్లో ప్రత్యక్ష ప్రసారం, జియోహాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. తొలి వన్డేలో కోహ్లి 88 బంతుల్లో అజేయంగా 139 పరుగులు చేశాడు. గిల్ 108 బంతుల్లో 110 పరుగులతో మెరిశాడు. వెస్టిండీస్ తరఫున జాన్ క్యాంప్వెల్ 60 బంతుల్లో 62, జస్టిన్ గ్రీవ్స్ 108 బంతుల్లో 101 పరుగులు చేశారు. ఒక దశలో విండీస్ 19 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (4/40) అద్భుత బౌలింగ్ తో కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు.