పరిష్కారమైన డిమాండ్లపై ఉత్తర్వులు,
వాటి అమలే ప్రధాన బాధ్యత పరిష్కారం
కాని సమస్యల సాధనకు నిరంతరం కృషి
డిసెంబర్ 12న చలో ఢిల్లీని జయప్రదం చేయండి
సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఘన సన్మానం
విజయవాడ, : ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించిన డిమాండ్లపై ఉత్తర్వులు జారీ చేయించి వాటిని అమలు చేయించడం, పరిష్కారం కాని సమస్యల సాధనకు నిరంతరం కృషి చేయడం సంఘం ప్రధాన బాధ్యత అని రాష్ట్ర అధ్యక్షుడు అలవర్తి విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్‌లోని ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్ష సమావేశానికి 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర సంఘ నాయకులు హాజరై ఉద్యోగుల సమస్యలు, ప్రస్తుత పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో పీఆర్సీ కమిటీ నియామకం, రెండు డీఏల మంజూరు, హెల్త్ కార్డుల కాంట్రిబ్యూషన్ చెల్లింపు, సరెండర్ లీవుల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణలను అభినందించింది. అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ దశాబ్దాలుగా ఉ ద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయని, ప్రస్తుతం కూడా ఉద్యోగుల డిమాండ్ల సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. అడిషనల్ క్వాంటం పెన్షన్ మంజూరు ద్వారా సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని, రెండు డీఏలను ఒకేసారి విడుదల చేసి సెప్టెంబర్ నెల జీతం నుంచే అమలు చేసి అక్టోబర్ 1న చెల్లించేలా చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, ప్రభుత్వం అందించే మ్యాచింగ్ గ్రాంట్‌ను నేరుగా హెల్త్ ట్రస్ట్‌కు బదిలీ చేయడం ద్వారా వ్యవస్థను మరింత పటిష్టం చేసే అవకాశం ఉండన్నారు. సుమారు 24 లక్షల మంది ఉ ద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డుల వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (ఏఏఎస్) అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరామని, ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తాజాగా జి.ఓ.యం.ఎస్. నెం .7 విడుదల చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 లక్షల మంది స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు ఉ ద్యోగులకు ఎఏ.ఎస్ వర్తింపజేయడం సానుకూల పరిణామమన్నారు. ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్ వర్తింపజేయడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా సంఘం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం కల్పించాలని, ఇంటీరిమ్ రిలీఫ్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలతో పాటు వివిధ శాఖల్లోని సమస్యలు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఈ-ఎస్‌ఆర్‌కు సంబంధించిన అంశాలు, ఉద్యోగుల పని విధానంలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఏఏఎన్, స్పెషల్ ఇంక్రిమెంట్ అమలుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, కెరీర్ ప్రోషన్, న్యాయమైన హక్కుల సాధన కోసం అసోసియేషన్ ప్రభుత్వంతో సమన్వయంతో వనిచేస్తుందని అన్నారు. డిసెంబర్ 12న ఢిల్లీలోని రామ్జీలా మైదానంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలోని 26 జిల్లాల ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉ ద్యోగుల వేతన సవరణ, పీఎస్ఆర్డీఏ బిల్లు రద్దు, ఓపీఎన్ అమలు, దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ప్రత్యేక విధానం తీసుకురావాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర అధ్యక్షుడు అలవర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణలు పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వారి కృషి, సంఘ చరిత్ర, విజయాలను వివరిస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. రూ.25 వేల కోట్లకు పైగా పాత బకాయిల చెల్లింపు, 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్ వర్తింపు, ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం, సుమారు 8 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ వర్తించేలా ఆమోదం వంటి అంశాల్లో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల కృషిని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా అభినందించింది. అనంతరం వారిని ఘనంగా సన్మానించింది. రాష్ట్ర సంఘ కౌన్సిల్ నిర్మాణం, రాష్ట్ర సంఘ భవన నిర్మాణం, జనవరిలో ఆవిష్కరించనున్న డైర్, క్యాలెండర్ల కోసం కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర సంఘ నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.