జీఎస్ఎల్వీ మార్క్-2 రాకెట్ ద్వారా
నింగిలోకి ఉపగ్రహం నావిక్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
రైల్వేలు, సముద్ర ప్రయాణాలు, దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో కీలక సేవలు
శ్రీహరికోట, : భారత దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌ను మరింత బలోపేతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని అక్టోబర్ 30న శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ మార్క్-2 రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రైల్వేల్లో రైళ్ల కదలికలను గుర్తించడం, సముద్రంలో నౌకలకు దిశానిర్దేశం చేయడం, స్థాన నిర్ధారణ, సమయ సమాచారం అందించడం, దేశ రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో నావిక్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో స్థాన నిర్ధారణ, దిశ, సమయ సేవలను అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. సుమారు 51.7 మీటర్ల ఎత్తు, 420 టన్నుల ప్రయోగ బరువు కలిగిన జీఎస్ఎల్పీ మార్క్-2 రాకెట్ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో ఘన ఇంధన ప్రధాన చోదకంతో పాటు నాలుగు ద్రవ ఇంధన సహాయక చోదకాలు, రెండో దశలో వికాస్ ఇంజిన్, చివరి దశలో స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ పనిచేస్తాయి. ఈ రాకెట్ ద్వారా సుమారు 2,232 కిలోల బరువున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని తొలుత భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉపగ్రహంలోని చోదక వ్యవస్థ సాయంతో నిర్దేశిత కక్ష్యలోకి చేరాల్సి ఉ ంటుంది. అమెరికా జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయ నావిగేషన్ సేవలను అందించేందుకు ఇస్రో అభివృద్ధి చేసిన నావిక్ వ్యవస్థ ప్రస్తుతం ఉపగ్రహాల కొరత, కొన్ని ఉపగ్రహాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉపగ్రహాల్లోని అత్యంత కచ్చితమైన అణు గడియారాలు సక్రమంగా పనిచేయడం స్థాన నిర్ధారణ సేవలకు కీలకం. ఈ నేపథ్యంలో రెండో తరం ఉపగ్రహాల ప్రయోగాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ శ్రేణిలో తొలి ఉ పగ్రహమైన ఎన్వీఎస్-01ను 2023 మే 29న, రెండో ఉ పగ్రహమైన ఎన్వీఎస్-02ను 2025 జనవరి 29న ప్రయోగించారు. అయితే ఎన్వీఎస్-02 నిర్దేశిత కక్ష్యలోని స్థానానికి చేరడంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఎన్వీఎస్-03 ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉపగ్రహం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో స్థిరపడి, అందులోని పరికరాలు సక్రమంగా పనిచేస్తే దేశీయ నావిగేషన్ వ్యవస్థ సామర్థ్యం మెరుగుపడనుంది. ఎన్వీఎస్-04, ఎన్వీఎస్-05 ఉపగ్రహాలను కూడా ప్రయోగించేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఇటీవలి ప్రయోగాల్లో ఎదురైన సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఎన్వీఎస్-08 ప్రయోగం ఇస్రోకు మరో కీలక పరీక్షగా నిలవనుంది. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడమే కాకుండా, అది నిర్దేశిత కక్ష్యలో స్థిరపడటం, పరికరాలు విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసుకుని సేవలు అందించడం కూడా కీలకమే. ఎన్వీఎస్-03 ప్రయోగం విజయవంతమైతే రైల్వేలు, రవాణా, సముద్ర ప్రయాణాలు, దేశ రక్షణ, విపత్తుల నిర్వహణ వంటి కీలక రంగాల్లో స్వదేశీ నావిగేషన్ సేవలను మరింత పటిష్టం చేసే దిశగా ఇస్రో ముందడుగు వేసినట్లవుతుంది.