ఇక సెలక్షన్ గురించి ఆలోచించను: ఇషాన్ కిషన్
టీమిండియాకు దూరమైన కాలం తనలోని లోపాలను తెలుసుకునేలా చేసిందని వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెప్పాడు. చేసిన కొన్ని తప్పుల వరిణామాలను అర్ధం చేసుకుని.. ఫిట్నెస్, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపాడు. దేశవాళీ క్రికెట్లో ఓపికగా అది తనను తాను నిరూపించుకున్నానని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించిన తర్వాత ఇషాన్ తన పునరాగమనంపై మాట్లాడాడు.
తప్పుల నుంచి పాఠాలు
అంతర్జాతీయ జట్టుకు దూరమైన సమయంలో తన తప్పులను సరిదిద్దుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు ఇషాన్ తెలిపాడు. ఫిట్నెన్ను మెరుగుపరుచుకోవడంతో పాటు బ్యాటింగ్‌పైనా వర్క్ చేశానని చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం తప్పకుండా వస్తుందని నమ్మానన్నాడు. "జట్టులో నుంచి తప్పించినప్పుడు నేను చేసిన కొన్ని తప్పుల వరిణామాలను అర్థం చేసుకున్నా. అందుకే ఫిట్నెస్, బ్యాటింగ్‌పై వర్క్ చేశా. ఓపికగా ఉండి దేశవాళీ క్రికెట్లో బాగా ఆడటంపై దృష్టి పెట్టా. అక్కడ నిలకడగా రాణిస్తే అవకాశం వస్తుందని తెలుసు. నా కష్టంతోనే మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చా" అని ఇషాన్ చెప్పాడు.
ఇక సెలక్షన్ గురించి ఆలోచించను..
మళ్లీ జట్టులోకి వచ్చిన తర్వాత తనను తిరిగి తప్పిస్తారేమోనన్న ఆలోచనతో ఒత్తిడికి గురికావడం లేదని ఇషాన్ స్పష్టం చేశాడు. తన చేతుల్లో ఉన్న విషయాలపైనే దృష్టి పెడుతున్నానని చెప్పాడు. "మళ్లీ జట్టులోకి వచ్చిన తర్వాత.. తిరిగి నన్ను తప్పిస్తే ఏం జరుగుతుందో అని ఆలోచించను. క్రికెట్‌ను ఆస్వాదించడం, జట్టు విజయానికి నా వంతు సహకారం అందించడమే ముఖ్యం. నా పని పరుగులు చేయడం. నేను వరుగులు చేస్తే మిగతావన్నీ వాటంతట అవే చూసుకుంటాయి" అని తెలిపాడు.