రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
తిరువూరు నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదు
పలుచోట్ల పొంగి పొరలుతున్న వాగులు, ఉపనదులు
అనేక గ్రామాలకు రాకపోకలకు అంతరాయం
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతోంది. వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం రెండు రోజుల్లో జిల్లాలో 2,540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా గురువారం కురిసిన అతి భారీ వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం వీచిన గాలి దుమారం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కేవలం రెండు నిమిషాల పాటు వీచిన బలమైన గాలులకు గ్రామంలో 60కిపైగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. 60కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఆర్డీవో ఏ. కుమార్ వెంటనే గ్రామానికి చేరుకుని క్షతగాత్రులను తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో వాగులు, ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వలు గ్రామాలకు గురువారం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నందిగామ మండల పరిధిలోని దాములూరు కూడలి వద్ద వైరా నది ఉదృతంగా ప్రవహించడంతో నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు మండలంలో నల్లవాగు ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గంపలగూడెం మండలంలో కట్టలేరు నిండుకుండలా ప్రవహించడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో వర్షాలు, గాలిదుమారం కారణంగా జరిగిన నష్టాన్ని వరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శ గురువారం పర్యటించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్న కలెక్టర్, గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి రెవెన్యూ సిబ్బందికి పలు నూచనలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావుతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఏ. కొండూరు, జి.కొండూరు మండలాల్లోని పలు గ్రామాలను కూడా కలెక్టర్ సందర్శించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ జగ్గయ్యపేట నియోజకవర్గ వరిధిలోని పలు వంట భూములను పరిశీలించారు. మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాలో గురువారం రాత్రి వరకు భారీ వర్షం కొనసాగుతూనే ఉంది.