వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సంచలన నిర్ణయం
భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక శకం ముగిసింది. జట్టును విజయవథంలో సడిపించిన సక్సెస్ఫుల్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇవాళ ఆమె అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలు 2026లో భారత జట్టుకు పరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని అందించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్ చేసింది. 'కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న నిర్ణయం అంత సులభం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, జట్టు ఎదుగుదల కోసం తీసుకున్న కఠిన నిర్ణయాల సమాహారం ఈ ప్రయాణం. ఈ రోజు కెప్టెన్సీని వీడుతున్నప్పుడు నా హృదయం భావోద్వేగాలతో నిండి ఉంది, కానీ అదే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నా జట్టు ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను" అని హర్మన్ ప్రీత్ పేర్కొంది. తాను ఒక సాధారణ ప్లేయర్ జట్టులో కొనసాగుతానని స్పష్టం చేసింది. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన సహచర క్రీడాకారిణులకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి, బీసీసీఐకి, తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన
భారత మహిళా క్రికెట్ జట్టు నూతన సారథిగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నియమితురాలైంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో వైట్ బాల్ క్రికెట్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మంధాన బాధ్యతలు చేపట్టనుంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్న స్మృతి మందానకు సారథ్య బాధ్యతలు కొత్తేమీ కాదు. గతంలో ఆమె 18 టీ20లు, నాలుగు వన్డే మ్యాచ్‌లలో భారత జట్టును ముందుండి నడిపించింది. దేశీయ, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ ఆమె తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును 2024, 2026 సంవత్సరాల్లో విజేతగా నిలిపి టైటిల్స్ అందించింది. తన నియామకంపై స్మృతి మంధాన స్పందిస్తూ, "భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు, సహచర క్రీడాకారిణులు, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ అందించిన విశేష సేవలను నేను గౌరవిస్తున్నాను. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి, భారత క్రికెట్‌ను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తాను" అని ఒక ప్రకటనలో పేర్కొంది.