విజయవాడ స్పోర్ట్స్ : జపాన్లోని బది- నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అంతర్జాతీయ ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, టి. గణేష్ మణిరత్నంలకు మంగళవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ (ఏపీఏఏ) ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఆర్చర్లు, పతక విజేతల తల్లిదండ్రులు విమానాశ్రయానికి చేరుకుని వారిని సత్కరించారు. శాప్ ఎంకరేజ్మెంట్ వింగ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎల్. వెంకట రమణ, ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాకర్ల కోటేశ్వరరావు, ఏపీఏఏ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ ఆర్చర్లను అభినందించారు. ధీరజ్ ప్రపంచకప్లో స్వర్ణ పతకంతో పాటు ఆసియా క్రీడల్లో రికర్వ్ టీమ్, మిక్స్డ్ ఈవెంట్లలో రెండు రజత పతకాలు సాధించగా, గణేష్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. విజయవాడ నుంచి తమ జిల్లాలకు వెళ్తున్న సందర్భంగా రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ కూడా ఆర్చర్లను అభినందించారు. ఈ సందర్భంగా ధీరజ్ మాట్లాడుతూ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో లో పతకం సాధించడమే తన లక్ష్యమని, అందుకోసం కఠినంగా శిక్షణ పొందుతున్నానని ప్రదర్శన కనబరిచి ఒలింపిక్ బెర్త్ సాధించేందుకు కృషి చేస్తానన్నారు. గణేష్ మాట్లాడుతూ 2028 ఒలింపిక్స్లో మిక్స్డ్ ఈవెంట్ ద్వారా బెర్త్ సాధించడమే లక్ష్యంగా శిక్షణను ముమ్మరం చేశానని తెలిపారు. తమ విజయాలకు తల్లిదండ్రులు, ఆర్చర్ అసోసియేషన్, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం ఎంతో కీలకమని ఇద్దరూ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ నూజివీడు ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు, రారా ఉపాధ్యక్షులు బొమ్మదేవర శ్రవణ్ కుమార్, గొట్టిపాటి ప్రేమ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎండీ అర్జద్ అలీ, కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు మండవ రాజ్యలక్ష్మి, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మండవ కోటేశ్వరరావు, గుంటూరు వోల్గా ఆర్చరీ అకాడమీ ఇన్చార్జి వెంకట్ కాకాని, ధీరజ్ తల్లి రేవతి, గణేష్ తండ్రి హరిప్రసాద్ పాటు పలువురు ఆర్చర్లు పాల్గొన్నారు.