ఆర్నబ్ తుఫాన్ నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
మోపిదేవి, : అర్నబ్ తుఫానుకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకుంటుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మండలంలోని కోసూరువారిపాలెంలో దెబ్బతిన్న అరటి తోటలను ఎమ్మెల్యే బుద్దప్రసాద్ గురువారం పరిశీలించారు. ఉద్యానవన శాఖ సిబ్బంది పంట నష్టం ప్రాధమిక అంచనాలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో అరటి, టమాటా, బొప్పాయి తోటలతో పాటు వివిధ దశల్లో ఉన్న వరిపైరుకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయిస్తోందన్నారు. రైతులకు పంట నష్ట పరిహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటన జారీ చేశారని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. తుఫాన్ గాలులకు నియోజకవర్గంలో వంద విద్యుత్ స్థంభాలు పడిపోయినట్లు తెలిపారు. ఇప్పటికే 90 శాతం పైగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని, ఇంకా ఏటిమొగ, ఎదురుమొండికి సాధ్యమైనంత వేగంగా పునరుద్ధరిస్తామని తెలిపారు. రైతాంగ నియోజకవర్గమైన అవనిగడ్డ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకత శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. నష్టపోయిన రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రాజెక్టుల కంటే ముందు అన్ని పంట కాలువలు, మురుగు కాలువలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా పూడిక తీయించాలని కోరారు. నియోజకవర్గంలో కోడూరు, నాగాయలంక మండలాల్లో కీలకమైన ఔట్ ఫాల్ స్లూయీజుల పునర్నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు పులిగడ్డ నుంచి విజయవాడ వరకు కరకట్ట రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం పట్ల సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదములు తెలిపారు. సముద్రపు కరకట్ట అభివృద్ధికి కూడా డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధుల నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.