2,050 'ఖాకీ' కొలువులకు నోటిఫికేషన్ జారీ
438 ఎస్ఐ.. 1569 కానిస్టేబుల్ పోస్టులు
ఫోరెన్సిక్ అసిస్టెంట్లు 43, ఫైర్మన్లు 158,
జైలు వార్డర్లు 171 కూడా ఆన్లైన్లో దరఖాస్తులు.. త్వరలో షెడ్యూల్
అమరావతి : శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాష్ట్ర హోం శాఖలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోం శాఖలోని కీలకమైన పోలీసు విభాగంతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్(ఏపీఎన్ఎల్ఆర్) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 438 ఎన్ఐ పోస్టులతో పాటు 1,569 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. విభాగాల వారీగా.. 253 ఎస్ఐఐ పోస్టులు, ఆర్మ్డ్ రిజర్వ్ 116, ఎస్పీఎఫ్ 9, కమ్యూనికేషన్లో 60, పీటీవోలో 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 542, ఆర్మ్డ్ రిజర్వ్ 285, అగ్నిమాపక శాఖలో 158 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో 171 వార్డెన్ పోస్టులు భర్తీ చేస్తుండగా వీరిలో పురుషులు 150, మహిళలకు 21 పోస్టులు కేటాయించారు. పోలీసు కానిస్టేబుల్ కమ్యూనికేషన్ విభాగంలో 200 పోస్టులు, పీటీవోలో 198 డ్రైవర్, 15 మెకానిక్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. సైంటిఫిక్ విభాగంలో ఫిజికల్, కెమికల్, బయాలజీ విభాగాలకు సంబంధించి 43 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు వివరించింది.
ఇవీ నిబంధనలు
సివిల్, ఏఆర్, పోలీసు ట్రాన్స్పోర్ట్, ఎస్పీఎఫ్ లో ఎస్ఐ పోస్టులకు కనీస విద్యార్హత డిగ్రీ కాగా వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ఈ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్షతో పాటు దేహదారుఢ్య శారీరక సామర్థ్య, తుది రాత పరీక్షలు ఉంటాయి. అదే విధంగా పీటీవో, కమ్యూనికేషన్ విభాగాల్లో ఎసై పోస్టులకు రాత పరీక్ష ఉండదు.