శ్రీహరికోట, : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జీఎస్ఎల్వీ-ఎఫ్ 18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం రాత్రి 11.51 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. రెండో ప్రయోగ వేదిక నుంచి నిర్వహించనున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. జీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 20వ ప్రయోగం కానుంది. సుమారు 50 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు కలిగిన జీఎస్ఎల్వీ రాకెట్ ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని భూ అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారత ప్రాంతీయ ఉ పగ్రహ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' సేవలను మరింత బలోపేతం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర దేశాల నావిగేషన్ వ్యవస్థలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు, దేశీయంగా నావిగేషన్ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు ఈ ప్రయోగం కీలకం కానుంది. భారత భూభాగంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో భూమి, సముద్ర, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలకు నావిక్ వ్యవస్థ మార్గదర్శక సేవలను అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశీయ నావిగేషన్ సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి.