దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ పట్టుబిగించింది. ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటి కొండంత స్కోర్ చేసిన ఈస్ట్ జోన్.. ఆ తర్వాత బౌలింగ్‌తో సౌత్ జోన్ పని పట్టింది. దాంతో చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈస్ట్ జోన్ బౌలర్లు మహమ్మద్ షమీ(2/17), ముఖేష్ కుమార్ (2/36) నిప్పులు చెరగడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులే చేసింది. క్రీజులో తిలక్ వర్మ(133 బంతుల్లో 5 ఫోర్లతో 56 బ్యాటింగ్), సీవీ మిలింద్(2 బ్యాటింగ్) ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముఖేష్ కుమార్‌తో పాటు ఖరైషి, శేఖర్ మోహన్ తలో వికెట్ తీసారు. సౌత్ జోన్ ఇంకా 466 వరుగుల వెనుకంజలో ఉంది. ఈస్ట్ జోన్ నిర్దేశించిన 708 పరుగుల భారీ స్కోర్‌ను అధిగమించేందుకు మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై సౌత్ జోన్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. ఓపెనర్ రికీ భుయ్ (1) ఆరంభంలోనే వెనుదిరగ్గా.. నారయణ్ జగదీషన్, దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడారు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన నారయణ్ జగదీషన్(32)ను శిఖర్ మోహన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు షేక్ రషీద్ కలిసి పడిక్కల్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో సౌత్ జోన్ 115/2 స్కోర్‌తో లంచ్ బ్రేకక్కు వెళ్లింది. రెండో సెషన్ ఆరంభంలోనే షేక్ రషీద్ (27)ను మహమ్మద్ షమీ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. సెంచరీ దిశగా సాగిన పడిక్కల్‌ను ముఖేష్ కుమార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 3 పరుగుల వ్యవధిలోనే సౌత్ జోన్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, రవిచంద్రన్ స్మరణ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని షమీ విడదీసాడు. రవిచంద్రన్ (23) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం శ్రేయస్ గోపాల్ క్రీజులోకి రాగా.. తిలక్ వర్మ ఆచితూచి ఆడటంతో సౌత్ జోన్ 176/5 టీ బ్రేక్ కు వెళ్లింది. ఆఖరి సెషన్లో సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తిలక్ వర్మ 123 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆచితూచి ఆడిన శ్రేయస్ గోపాలు ఖురైషి ఔట్ చేసి ఆరో వికెట్‌కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. చామ మిలింద్ తో కలిసి తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో ఈస్ట్ జోన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మరో వికెట్ పోకుండా మూడో రోజు ఆటను ముగించాడు.