అబద్ధాలు రుద్దోద్దు... ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు
జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై
రాష్ట్ర ఖ్యాతిని చాటి పతకాలు, సర్టిఫికెట్లు పొందాం
ఉత్తమ ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించాం
అలాంటి మమ్మల్ని అవమానించడం దుర్మార్గం
మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం స్పోర్ట్స్ కోటా టీచర్ల ఆగ్రహం.. బెజవాడలో భేటీ
విజయవాడ, : మెగా డీఎస్సీపై జగన్ ముఠా దుష్ప్రచారం చేస్తోందని డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లు మండిపడ్డారు. ప్రతిభతో ఉ ద్యోగాలు సాధించిన తమను అవమానించడం తగదని, మెగా డీఎస్పీపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. మెగా డీఎస్సీ నియామకాలపై వాస్తవాలను వివరించేందుకు స్పోర్ట్స్ కోటా టీచర్లు ఆదివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన 300 మందికి పైగా అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాము అడ్డదారిలో ఉద్యోగాలు సాధించలేదని, కష్టపడి సాధించామని ముక్తకంఠంతో స్పష్టం చేశారు. టెట్ అర్హత సాధించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాష్ట్రఖ్యాతిని చాటి సర్టిఫికెట్లు పొందామని వివరించారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే కూటమి ప్రభుత్వం తమకు వ్యాయామ ఉపాధ్యాయులుగా 3 శాతం రిజర్వేషన్‌తో ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం నియామకాలను పారదర్శకంగా చేవట్టిందన్నారు. ఉద్యోగాలను అమ్ముకుంటే ఇంకా బ్యాక్‌లైన్‌లో సుమారు 40 పోస్టులు ఎందుకు మిగిలి ఉంటాయని అభ్యర్థులు ప్రశ్నించారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లను క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యలు ఇస్తాయని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) మంజూరు చేయదని, ఈ విషయం వైసీపీ నేతలకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. బ్రిడ్జ్ గేమ్ (పేకాట) సర్టిఫికెట్‌కు ఉద్యోగాలు ఇచ్చారంటూ మాజీ మంత్రి పేర్చి నాని చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. 'రాష్ట్రంలో బ్రిడ్జ్ గేమ్ సంఘం లేనేలేదు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారిలో బ్రిడ్జ్ గేమ్ క్రీడాకారులు లేరు' అని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా, కేవలం బురద చల్లేందుకు జగన్ ముఠా అనత్య ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్స్లోలో 'స్పోర్ట్స్ టీచర్స్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్
మెగా డీఎస్సీపై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ స్పోర్ట్స్ కోటా టీచర్ల సమావేశం నేపథ్యంలో ఆదివారం 'స్పోర్ట్స్ టీచర్స్ ఫైట్ ఫేక్స్' హ్యాష్ ట్యాగ్ 'ఎక్స్'లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక సమయంలో ఈ యాష్ ట్యాగ్ నెంబర్ వన్ స్థానంలో కూడా నిలిచింది. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా స్పోర్ట్స్ టీచర్లు ఈ పోరాటానికి శ్రీకారం చుట్టారు.