తిరుమల, : శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో నిర్వహించే అనేకానేక ఉత్సవాల్లో భాగమైన భాగ్ సవారి ఉత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరునటి రోజు భాగ్ నవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం ప్రకారం స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించేందుకు శ్రీదేవి సమేతంగా స్వామివారు మానవ రూపంలో అనంతాళ్వారుల పూదోటకు విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారులు అశ్వత్థ వృక్షానికి బంధిస్తారు. అనంతరం స్వామివారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన ఆప్రదక్షిణ దిశలో పరుగెత్తి ఆలయంలోకి ప్రవేశించి మాయమవుతారు. విషయం గ్రహించిన అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించేందుకు విచ్చేసింది సాక్షాత్తు స్వామివారేనని తెలుసుకుని పశ్చాత్తాపపడతారు. వెంటనే అమ్మవారిని బంధం నుంచి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తారు. తన భక్తుని భక్తికి మెచ్చిన స్వామివారు ఆయన కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరుసటి రోజు అనంతాళ్వారుల తోటలోకి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చినట్లు వురాణ ప్రాశస్త్యం చెబుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భాగ్ నవారి ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభవోత్సవ మండవం నుంచి బయలుదేరి ఆప్రదక్షిణంగా అనంతాళ్వారుల తోటకు చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలందుకున్నారు. అనంతరం తిరిగి ఆలయంలోకి ప్రవేశించడంతో ఉత్సవం ఘనంగా ముగిసింది. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుకైవారి తోటలో అనంతాళ్వారుల వంశీకులు భాగ్ సవారి ఉత్సవం సందర్భంగా నాకాయిర దివ్య ప్రబంధం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుముల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, పేష్కార్ రామకృష్ణ, ఇతర ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.