కేరళపై విజయం.. జాతీయ ఛాంపియన్ గా
ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టుకు నాలుగో స్థానం
క్రీడాకారులను సత్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, : జాతీయ సబ్ జూనియర్ సాప్ట్బల్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు స్వర్ణ పతకం సాధించింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సాఫ్ట్బేల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన 39వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ బాలికల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. ఫైనల్లో బలమైన కేరళ జట్టును ఓడించి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. బాలుర విభాగంలోనూ ఏపీ జట్టు అత్యుత్తమ ఆటతీరుతో నాలుగో స్థానాన్ని సాధించింది. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన బాలికలు, బాలుర జట్టు క్రీడాకారులు, శిక్షకులను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను అభినందించారు. క్రమశిక్షణ, పట్టుదలతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు బుడ్డయ్య క్రీడాకారులు, శిక్షకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.