చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక..
తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనుక.. ఈ పాట గుర్తుంది కదా..
ఒకప్పటి హిట్ సాంగ్..
ఇప్పుడు ఇదే పాటను సోషల్ మీడియాలో ఓ పెంగ్విన్ అందరినీ వదిలి ఎటేపు నీ నడక.. తెలిసీ మృత్యువు కోసం ఏమిటి నీ నడక అంటూ పాడుకుంటున్నారు. ఏమిటి? ఎదో తెలుగు పాటకి లింక్ పెట్టి పెంగ్విన్.. అని ఏదేదో చెబుతున్నారు అనుకుంటున్నారా? ఒక పెంగ్విన్ అంటార్కిటికా కొండల్లో ఒంటరిగా చేస్తున్న ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఆ పెంగ్విన్ కథ మీకు చెప్పాలనే ఈ పాటను గుర్తు చేశాం.
సరే అసలు స్టోరీ ఏమిటంటే, అంటార్కిటికాలో పెంగ్విన్స్ ఉ ంటాయని అందరికీ తెలిసిందే. అలాగే, ఇవి చాలా సందర్భాల్లో మానుషుల్లానే బిహేవ్ చేస్తాయని కూడా చాలా వీడియోల్లో చూశాం. నిజానికి పెంగ్విన్ ను చూస్తే భలే ముద్దుగా.. గమ్మత్తుగా కనిపిస్తుంది. మనం నడిచినట్లే నడుస్తూ.. చిన్న పిల్లల బుడిబుడి అడుగుల్లా మంచులో తిరుగాడుతున్న వీడియోలు చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ పెంగ్విన్స్ మంచు పేరుకుపోయిన అంటార్కిటికా ప్రాంతంలో గుంపులుగా నివసిస్తాయి. అన్నీ కలిసి ఉమ్మడిగానే తిరుగాడుతుంటాయి. ఎప్పుడూ కూడా పెంగ్విన్ ఒంటరిగా కనిపించదు. ఇవన్నీ తెలిసినవే. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో పెంగ్విన్ గుంపు నుంచి వేరుపడి. ఒంటరిగా మరో దిక్కుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న పెంగ్విన్ కనిపిస్తోంది. దీనిని చాలామంది సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు. అలా ఎందుకు ఒంటరిగా వెళు తోంది అని ఎవరికీ తెలిసిన స్టోరీ వాళ్ళు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. పెంగ్విన్స్ గుంపులుగా ఆహారం కోసం సముద్రం వైపు వెళతాయి. అయితే, ఈ వీడియోలో ఆలా గుంపుగా సముద్రం వైపు వెళుతున్న పెంగ్విన్స్ నుంచి ఒక పెంగ్విన్ వాటికి సరిగ్గా వ్యతిరేక దిశలో నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. అది వెళుతున్న వైపు మంచు కొండలు తప్ప మరోటి లేవు. అంటే ఆ పెంగ్విన్ కి అటువైపు ఆహరం దొరికే ప్రసక్తే లేదు. కానీ, అది ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. చుట్టూ మంచు.. మధ్యలో ఈ పెంగ్విన్ ఒంటరి నడక. అది చూస్తే ఒక తపస్వి గమ్యం వెతుక్కుంటూ వెళుతున్నట్టు అనిపిస్తుంది. అసలు అది అలా ఎందుకు వెళుతోంది?
ఈ వీడియోలపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కానీ, ఆ పెంగ్విన్ ఒంటరి ప్రయాణం మృత్యువు కోసమే అంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ఎందుకు అలా? దీనిపై చాలా కాలం క్రితం ప్రఖ్యాత రచయిత, దర్శకుడు పూరి జగన్నాధ్ ఒక పాడ్ కాస్ట్ చేశారు. తన పూరి మ్యూజింగ్స్ లో పెంగ్విన్ జీవన చిత్రం గురించి వివరించారు. పెంగ్విన్స్ చాలా ఎమోషనల్ గా ఉ ంటాయి. ఒక మగ పెంగ్విన్ ఒక ఆడ పెంగ్విన్ తో మాత్రమే జత కడుతుంది. ఆ ఆడ పెంగ్విన్ తో జత కట్టడం అంత ఈజీగా ఏమీ జరగదు. దానికి చాలా తతంగం ఉంటుంది. అది అంతా ఇక్కడ అవసరం లేదు కానీ, ఒక మగ, ఆడ పెంగ్విన్స్ జత కట్టాకా జీవితాంతం కలిసే ఉంటాయి. ఇక్కడ మగ పెంగ్విన్స్ ఆడ పెంగ్విన్స్ కంటే ఎక్కువ ఎమోషనల్ గా ఉంటాయి. ఒక్కసారి తాను కోరుకున్న ఆడ పెంగ్విన్ తో జత కట్టాకా చచ్చేవరకూ దానితోనే కలిసి ఉ ంటాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఆడ పెంగ్విన్ ను విడిచి పెట్టదు. ఆడ పెంగ్విన్ గుడ్లు పెడితే, ఆ గుడ్లను మగ పెంగ్విన్ పొదుగుతుంది. తిండి, నిద్ర మానేసి దాదాపు రెండు నెలల పాటు ఆ గుడ్లను పొదగడంలోనే ఉండిపోతుంది.
ఈ క్రమంలో చిక్కిశల్యం అయిపోతుంది. ఎప్పుడైతే, గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయో ఆ తరువాతే, ఆ మగ పెంగ్విన్ సముద్రంలోకి ఆహరం కోసం వెళతాయి. పిల్లలకు ఆహారాన్ని అవే తెచ్చి పెడతాయి. ముందే చెప్పినట్టు ఏ పెంగ్విన్ జంట ఎప్పుడూ విడిపోదు. కానీ, విధి విచిత్రాలు చేస్తుంటుంది కదా. అప్పుడప్పుడు ఒక్కో ఆడ పెంగ్విన్ తన జతగాడిని విడిచిపెడుతుంది (ఇది చాలా చాలా రేర్ గా జరుగుతుందట) కానీ, ఎప్పుడూ మగ పెంగ్విన్ మాత్రం తన ప్రియురాలిని వదిలి పెట్టదు. అయితే, ఇలా ఎప్పుడైనా ఆడ పెంగ్విన్ తన జతగాడిని వదిలిపెట్టేసింది అనుకోండి.. అప్పుడు మగ పెంగ్విన్ ఆ బాధను తట్టుకోలేదు. దానిని మర్చిపోలేదు. ఆ బాధతో అది తన గుంపును వదిలేస్తుంది. సముద్రానికి వ్యతిరేక దిశలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ముందే చెప్పినట్టు అక్కడ దానికి ఎటువంటి ఆహరం దొరకదు. ఆ విషయం ఆ పెంగ్విన్ కి కూడా తెలుసు. అలా వెళ్ళిపోయి ఎదో ఒక ప్రాంతంలో అది ఆహరం లేక తన ప్రాణాలు విడిచేస్తుంది.
అదేవిధంగా బహుశా ఈ పెంగ్విన్ కూడా ఒంటరిగా వెళ్లిపోతుండవచ్చు. ఇప్పుడు ఒక్క పెంగ్విన్ గురించి ఇంత స్టోరీ ఎందుకు చెప్పామా అనే అనుమానం మీకు రావచ్చు.. కానీ, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విపరీతాలను చూశాకా.. ఈ పెంగ్విన్ వీడియో ద్వారా ఒక మంచి విషయం అర్ధం చేసుకోవచ్చుగా. ప్రేమించిన యువతి కాదన్నదనే కారణంతో ఏసిడ్ పోసేవారు.. పురుషాహంకారంతో మీసాలు మెలేసే మగరాయుళ్ళు.. చిన్న చిన్న కారణాలకు విడాకులకు పరుగులు తీసే యువ జంటలు.. భర్తను మోసం చేసి పక్క తిరుగుళ్లకు అలవాటు పడే మహిళామణులు ఇలా ఒక్కటేమిటి మనం ప్రతిరోజూ ఎన్నో కథనాలు వింటున్నాం. అంతరిక్షంలోకి దూసుకుపోయే తెలివితేటలు ఉండి.. భూమిపై అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న మానవులకు.. ఎక్కడో మంచు ఖండాల్లో బ్రతికే ఈ పెంగ్విన్ జీవనశైలి ఆదర్శవంతం కదూ.
ఏది ఏమైనా ఈ ఒంటరిగా సాగిపోతున్న పెంగ్విన్ మనకు చాలా పెద్ద జీవిత పాఠమే చెబుతోంది కదూ. సరే.. ఇప్పుడు ట్రెండింగ్ గా మరిన ఈ వీడిపై సోషల్ మీడియాలో భలే కామెంట్స్ వస్తున్నాయి.