స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'మా ఇంటి బంగారం' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, నెల రోజులు కూడా గడవకముందే డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతుండటం గమనార్హం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. స్వర్ణ అనే అనాథ యువతిగా సమంత నటన, ముఖ్యంగా ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన భర్త రాజ్ నిడిమోరు, తదితరులతో కలిసి సమంత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దిగంత్ మంచాలే, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి. గౌతమి కీలక పాత్రల్లో నటించారు. తొలుత ఈ సినిమా జూలై చివరిలో లేదా ఆగస్టులో ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగినా, అనూహ్యంగా ముందుగానే స్ట్రీమింగ్ డేట్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.