ఏడు నెలల నిరీక్షణకు చెక్ పెడుతూ.. 'జన నాయగన్' జులై 24న సందడి చేయనుంది. విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. బోర్డు చెప్పిన మార్పులను చేసి చిత్రబృందం దీన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా అన్కట్ వెర్షన్ విడుదల కానుంది. భారత్లో పలు కట్స్ విధించినప్పటికీ, యూకే లో మాత్రం ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడ ఈ సినిమాను ఎలాంటి మార్పుల్లేకుండానే విడుదల చేసేందుకు అనుమతి లభించింది. ఇక విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో సినిమా టైటిల్ కార్డులోనూ మార్పు చేశారు. గతంలో దళపతి విజయ్ అనే టైటిల్ కార్డు.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గా మారనుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 12 మార్పులు సూచించి 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. విజయ్ (నేతృత్వంలోని రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ప్రస్తావన ఉన్న డైలాగ్లను తొలగించడంతో పాటు కొన్ని పదాలను మ్యూట్ చేయాలని.. మరికొన్ని సన్నివేశాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. విడుదల నేపథ్యంలో త్వరలోనే దీని రిలీజ్ ట్రైలర్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.